8 ఆగస్టు కరంట్ అఫైర్స్

0
31

కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్కే దావన్ కన్నుమూత; పెప్సీకో సీఈవోగా ఇంద్రా నూయి రాజీనామా; కాటిఫ్ కప్ టోర్నీలో భారత్ విజయం; హైఎనర్జీ డెన్సిటి స్టోరేజ్ డివైజ్ ఆవిష్కరణ; ఇరాన్ పై అమెరికా ఆంక్షలు

1. కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్కే దావన్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత రాజీందర్ కుమార్ ధావన్ (81) ఆగస్టు 6న ఢిల్లీలో కన్నుమూశారు. 1962-84 మధ్య కాలంలో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ధావన్ 1990లో కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యాడు. 1995-96 కాలంలో గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. దావన్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్‌లోని చీనియట్‌లో 1937 జూలై 16న జన్మించాడు. బెనారస్ హిందూ యూనివ ర్శిటీలో చదివిన ధావన్ 74 ఏళ్ల వయసు (2012) లో పెళ్లి చేసుకున్నారు. 

2. పెప్సీకో సీఈవోగా ఇంద్రా నూయి రాజీనామా

అమెరికాకి చెందిన శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్‌‌స తయారీ సంస్థ పెప్సీకో సీఈవోగా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ ఇంద్రా కృష్ణమూర్తి నూయి త్వరలో తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు కంపెనీ నూతన సీఈవోగా డెరైక్టర్ల బోర్డు ఎంపిక చేసిన కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగుర్తాకు ఆమె అక్టోబర్ 3న బాధ్యతలను అప్పగించనున్నారు. అయితే 2019 జనవరి వరకు ఇంద్రానూయి చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. 1994లో పెప్సీకో ఉద్యోగిగా చేరిన ఇంద్రానూయి 2001లో పెప్సీకో సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. అలాగే 2006లో సీఈవోగా, ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. 44 ఏళ్ల పెప్సీకో కంపెనీకి ఆమె ఐదో సీఈవో. యుమ్ బ్రాండ్ పునరుద్ధరణ, ట్రోపికానా కొనుగోలు, క్వాకర్ ఓట్స్ విలీనం, గాటొరేడ్ కొనుగోలులో నూయి కీలక పాత్ర పోషించారు.

3. కాటిఫ్ కప్ టోర్నీలో భారత్ విజయం

‘కాటిఫ్ కప్’ అండర్-20 టోర్నమెంట్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు విజేతగా నిలిచింది. స్పెయిన్‌లోని వాలెన్సియాలో ఆగస్టు 6న జరిగిన ఈ టోర్నమెంటులో భారత్ 2-1తో అర్జెంటీనాపై విజయం సాధించింది. గతంలో అండర్- 20 విభాగంలో అర్జెంటీనా ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 

4. హైఎనర్జీ డెన్సిటి స్టోరేజ్ డివైజ్ ఆవిష్కరణ

ప్రపంచంలోనే తొలిసారిగా హై ఎనర్జీ డెన్సిటి స్టోరేజ్ డివైజ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆగస్టు 7న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో వంద ఎకరాల్లో ఎనర్జీ స్టోరేజ్ పార్క్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ ఎనర్జీ స్టోరేజ్ డివైస్‌ను భారత్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ(బీఈఎస్‌టీ) ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, టెలికం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఎనర్జీ స్టోరేజ్‌కి అత్యధిక ప్రాధాన్యత ఉంది. 

5. ఇరాన్ పై అమెరికా ఆంక్షలు

అణు ఒప్పందాన్ని అనుసరించి ఇరాన్‌పై అమెరికా 2015లో ఎత్తేసిన ఆంక్షలను తిరిగి పునరుద్ధరించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో ఇరాన్-అమెరికాల మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని ట్రంప్ 2018మే నెలలో రద్దు చేశారు. మరింత సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకుని ఆంక్షలను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.