4 ఆగస్టు కరంట్ అఫైర్స్

0
28

తొలి ట్రిలియన్ డాలర్ల కంపెనీగా యాపిల్; భారత వృద్ధి రేటు 7.5 శాతం; జియో యాప్‌లో ఎస్‌బీఐ యోనో సేవలు; నాలుగో విడత హరితహారం ప్రారంభం; సూపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

1. తొలి ట్రిలియన్ డాలర్ల కంపెనీగా యాపిల్

ప్రపంచ తొలి ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా యాపిల్ అవతరించింది. ఆగస్టు 2న యాపిల్ షేర్ 2.8 శాతం పెరిగి 207.05 డాలర్లను తాకడంతో యాపిల్ ట్రిలియన్ డాలర్ల కంపెనీగా నిలిచింది.

1976లో ఒక గ్యారేజ్‌లో స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీని అరంభించాడు. పలు కారణాలతో 1985లో ఆయన కంపెనీ నుంచి వైదొలిగి 1997లో తిరిగి చేరాడు. 1998లో కలర్‌ఫుల్ ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్ కంప్యూటర్, ఐమ్యాక్ జీ3ని మార్కెట్లోకి తెచ్చిన యాపిల్ 2001లో పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ ఐపాడ్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ప్రస్తుతం ప్రతి క్వార్టర్లో 4 లక్షలకు పైగా ఐఫోన్లను యాపిల్ విక్రయిస్తోంది. 

ప్రపంచంలోని మొత్తం డబ్బు 83.6 లక్షల కోట్ల డాల‌ర్లు. భారత ఆర్థిక వ్యవస్థ 2.5 లక్షల కోట్ల డాల‌ర్లు కాగా యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ ఒక లక్ష కోట్ల డాల‌ర్లు.

2. భారత వృద్ధి రేటు 7.5 శాతం

2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ- మోర్గాన్ స్టాన్లీ నివేదిక ఆగస్టు 2న అంచనా వేసింది. అలాగే ద్రవ్యోల్బణం 4 శాతం, క్యాడ్ స్థూల దేశీయోత్పత్తిలో 2.5 శాతంగా ఉంటుందని తెలిపింది. 2017-18లో భారత్ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది.

3. జియో యాప్‌లో ఎస్‌బీఐ యోనో సేవలు

రిలయన్స్ మై జియో యాప్ ద్వారా ఎస్‌బీఐ ‘యోనో’ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఎస్‌బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలు ఆగస్టు 2న ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో ప్రస్తుతం యోనో ద్వారా అందుబాటులో ఉన్న బ్యాంకింగ్, ఆర్థిక సేవలు మై జియో ద్వారా పొందవచ్చు. ఈ ఒప్పందం ద్వారా ఎస్‌బీఐ డిజిటల్ కస్టమర్ల బేస్‌ను పెంచుకునేందుకు వీలుంటుంది. అలాగే ఎస్‌బీఐ బ్యాంకింగ్, ఆర్థిక సేవలను జియో పేమెంట్స్ బ్యాంకు కస్టమర్లు పొందవచ్చు.

త్వరలో ప్రారంభం కానున్న జియో పేమెంట్స్ బ్యాంకులో జియోకు 70 శాతం, ఎస్‌బీఐకి 30 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఎస్‌బీఐ చైర్మన్‌గా రజనీష్ కుమార్ ఉన్నారు.

4. నాలుగో విడత హరితహారం ప్రారంభం

తెలంగాణలో పచ్చదనం పెంచేందుకు చేపట్టిన హరితహారం నాలుగో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌లో ఆగస్టు 1న ప్రారంభించారు. ఈ మేరకు గజ్వేల్‌లోని ఇందిరా పార్కు చౌరస్తాలో కదంబ మొక్క నాటారు. కార్యక్రమంలో భాగంగా గజ్వేల్‌లో 1,00116 మొక్కలు నాటాలని నిర్దేశించుకోగా మొత్తం 1,25,235 మొక్కలను నాటారు.

5. సూపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

తక్కువ ఎత్తులో దూసుకొచ్చే బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయగల స్వదేశీ సూపర్‌సోనిక్ ఇంటర్‌సెప్టార్ క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ అబ్దుల్ కలాం దీవి నుంచి ఆగస్టు 2న ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 7.5 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణిలో అధునాతన రాడార్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ క్షిపణికి ఇంకా పేరు పెట్టలేదు.