31 జులై కరంట్ అఫైర్స్

0
21

పాకిస్థాన్‌లో జూలై 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం జూలై 28న విడుదల చేసింది; దేశంలో ఉన్న ఉద్యాన యూనివర్సిటీలలో తాడే ల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి అగ్రస్థానం లభించింది; సినారె పేరిట ‘డాక్టర్ సి.నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’; ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవికి మాలతీ చందూర్ పురస్కారం లభించింది; మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ లభించింది.

పాకిస్థాన్‌లో జూలై 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం జూలై 28న విడుదల చేసింది:

ఈ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ‘పాకిస్థాన్ తెహ్రీకీ ఇన్సాఫ్’ (పీటీఐ) 115 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మాజీ ప్రధాని షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ పీఎంఎల్(ఎన్) పార్టీ 64 సీట్లు గెలుపొందగా, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 43 సీట్లను గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 13 స్థానాలు గెలుపొందారు. పాకిస్తాన్ పార్లమెంటు దిగువ సభలో మొత్తం 342 సీట్లు ఉండగా అందులో 272 మంది ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. తాజాగా 270 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 172 సీట్లు ఉండాలి. అక్కడి చట్టాల ప్రకారం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక ప్రభుత్వం ఏర్పాటుకు 21 రోజుల సమయం ఇస్తారు. మరోవైపు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అదనంగా గెలుచుకున్న స్థానాలకు రాజీనామా చేయాలి. దీంతో ఐదు నియోజకవర్గాల్లో గెలుపొందిన పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ నాలుగు సీట్లకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.

           పాకిస్థాన్‌లో తొలిసారిగా ఒక హిందువు ఎంపీగా గెలిచాడు. పీపీపీ తరపున సింధ్ ప్రావిన్స్ లోని థార్‌పార్కర్-2 స్థానం నుంచి పోటీ చేసిన మహేశ్ కుమార్ మలానీ 20వేల ఓట్లతో విజయం సాధించాడు. పాకిస్తాన్‌లో ముస్లిమేతరులకు పార్లమెంటుకు పోటీ చేసే, ఓటు వేసే హక్కు కల్పించిన 16 ఏళ్ల తర్వాత ఓ హిందువు పోటీచేసి గెలవడం ఇదే తొలిసారి. హిందు రాజస్తానీ పుష్కర్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహేశ్.. 2003-08లో పీపీపీ తరపున పార్లమెంటుకు నామినేటెడ్ ఎంపీగా ఉన్నారు. 

2. దేశంలో ఉన్న ఉద్యాన యూనివర్సిటీలలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీకి అగ్రస్థానం లభించింది.

ఈ మేరకు న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) 2018 ఏడాది ర్యాంకులు జూలై 28న ప్రకటించింది. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల పనితీరు, రైతులకు అందించిన ప్రయోజనాల ఆధారంగా ఐసీఎఆర్ ఈ ర్యాంకులను కేటాయించింది.

3. జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరిట ‘డాక్టర్ సి.నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’ ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు జూలై 28న వెల్లడించారు.

సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు తరఫున ఏటా సినారె జయంతి రోజున (జులై 29) ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పుర స్కారం కింద రూ.3 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందిస్తారు. 2019లో హైదరాబాద్‌లో తొలి పురస్కారం ను బహుకరిస్తారు.

4. ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవికి మాలతీ చందూర్ పురస్కారం – 2018 లభించింది.

తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జూలై 28న తెలిపారు. ఆగస్టు 25న హైదరాబాద్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అవార్డును ప్రదానం చేస్తారు. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన నవలా రచయిత్రికి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చందూర్ కుటుంబం, స్నేహితులు సంయుక్తంగా ఏటా మాలతీ చందూర్ పురస్కారాన్ని అందచేస్తారు.

5. మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ లభించింది.

ఈ మేరకు హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జూలై 29న జరిగిన రేసులో హామిల్టన్ 70 ల్యాప్‌ల దూరాన్ని గంటా 37 నిమిషాల 16.427 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. హంగేరియన్ సర్క్యూట్‌లో హామిల్టన్‌కు ఇది ఆరో టైటిల్ కాగా ఈ సీజన్‌లో ఐదో టైటిల్.

ఈ రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానంలో నిలవగా రైకొనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచాడు. అలాగే భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా 13, 14 స్థానాల్లో నిలిచారు. ఈ సీజన్‌లో తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగ స్ట్ 26న జరుగనుంది.