30 జనవరి కరెంట్ అఫైర్స్ 2019

  0
  10

  *అవినీతి సూచీలో మెరుగుపడ్డ భారత్‌
  *టీ-హబ్‌ కొత్త సీఈఓ రవి నారాయణ్‌
  *పాకిస్థాన్‌లో జడ్జిగా మొదటి హిందూ మహిళ సుమన్‌కుమారి

  అవినీతి సూచీలో మెరుగుపడ్డ భారత్‌

  దిల్లీ: మనదేశంలో 2017తో పోలిస్తే గతేడాది అవినీతి కాస్త తగ్గిందని తాజా నివేదిక ఒకటి అభిప్రాయపడింది. సంబంధిత సూచీలో భారత్‌ స్థానం మెరుగైనట్లు వెల్లడించింది. మొత్తం 180 దేశాల్లో అవినీతిపై వ్యాపారవేత్తల అంచనాలు సేకరించి ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌’ సంస్థ ‘అవినీతి అంచనాల సూచీ-2018’ను విడుదల చేసింది. ఇందులో మనదేశం 41 స్కోరుతో 78వ స్థానంలో నిలిచింది. 2017లో భారత్‌ స్కోరు 40. అప్పుడు 81వ స్థానంలో ఉంది. అవినీతి సూచీలో అమెరికా 2011 తర్వాత తొలిసారిగా అగ్రశ్రేణి 20 దేశాల జాబితాలో చోటుకోల్పోయింది.

  టీ-హబ్‌ కొత్త సీఈఓ రవి నారాయణ్‌

  టీ-హబ్‌ నూతన సీఈఓగా రవి నారాయణ్‌ నియమితులయ్యారు. సాంకేతిక రంగంలో ఆయనకు విశేష అనుభవం ఉన్నట్లు, స్వయంగా ఆయన మూడు కంపెనీలను స్థాపించారని తెలంగాణా ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ పేర్కొన్నారు. అంతేగాక సింగపూర్‌, మలేషియా ప్రభుత్వాలకు సలహాదారుడిగా కూడా వ్యవహరించారని తెలిపారు. రవి నారాయణ్‌ మద్రాస్‌ ఐఐటీ నుంచి ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా నుంచి ఎంఎస్‌, ఎంబీఏ డిగ్రీలు పొందారు. తనను సీఈఓగా నియమించినందుకు రవి నారాయణ్‌ టీ-హబ్‌ బోర్డుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కొత్త మైలురాళ్లు అధిగమించటానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

  పాకిస్థాన్‌లో జడ్జిగా నియమితులైన మొదటి హిందూ మహిళ సుమన్‌కుమారి

  పాకిస్థాన్‌లో జడ్జిగా నియమితులైన మొట్టమొదటి హిందూ మహిళగా సుమన్‌కుమారి చరిత్ర సృష్టించారు.

  సుమన్‌కుమారి ఖంబర్‌-షాదాద్‌కోట్‌ కోర్టు సివిల్‌ జడ్జిగా నియమితులయ్యారు. సుమన్‌కుమారి స్వస్థలం కూడా ఖంబర్‌-షాదాద్‌కోట్‌ జిల్లానే. పాకిస్తాన్‌లో జడ్జిగా పనిచేసిన తొలి హిందువుగా జస్టిస్‌ రానా భగవాన్‌దాస్‌ నిలిచారు. 2005 నుంచి 2007 వరకు సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆయన సేవలందించారు.