28 జూన్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  7

  # నిర్మలా సీతారామన్‌కు అరుదైన గౌరవం
  # ఐరాస మండలిలో భారత్‌కు మద్దతు
  # FAO డెరైక్టర్ జనరల్‌గా చైనా మంత్రి.

  నిర్మలా సీతారామన్‌కు అరుదైన గౌరవం

  యూకె-ఇండియా సంబంధాలను మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషించిన 100 మంది ప్రభావవంతులైన మహిళల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు చోటు దక్కింది. లండన్‌లో జూన్ 26న నిర్వహించిన ‘భారత దినోత్సవం’ సందర్భంగా యూకే హోంశాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ పార్లమెంట్ హౌస్‌లో ఈ మేరకు జాబితాను విడుదల చేశారు.ఈ జాబితాలో బిటన్‌కు చెందిన సీనియర్ కేబినెట్ మంత్రి పెన్నీ మోర్డాంట్చోటు దక్కించుకున్నారు. నిర్మలా సీతారామన్ కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో కీలక పాత్ర పోషించారు. భారతదేశంలో ఈ మంత్రిత్వ శాఖను నిర్వహించిన అత్యంత ప్రభావవంతమైన మహిళగా నిర్మల గుర్తింపు పొందారు.

  ఐరాస మండలిలో భారత్‌కు మద్దతు

  ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎంపిక చేసేందుకు నిర్వహించే ఎన్నికల్లో ఇండియా అభ్యర్థిత్వానికి 55 దేశాలతో కూడిన ఆసియా-పసిఫిక్ బృందం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ జూన్ 26న తెలిపారు. చైనా, పాకిస్తాన్‌లు కూడా ఈ ఆసియా-పసిఫిక్ దేశాల బృందంలో ఉన్నాయి.

  భద్రతామండలిలో ఐదు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉండగా, మరో పది దేశాలకు తాత్కాలిక సభ్యత్వం కల్పిస్తారు. ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఆ పది తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకుంటారు. ప్రతి ఏడాదీ ఎన్నిక నిర్వహించి ఐదు దేశాలను ఎంపిక చేస్తారు. ఒకసారి ఎన్నికై తే ఆ దేశాలకు రెండేళ్లపాటు భద్రతామండలిలో తాత్కాలిక సభ్యత్వం లభిస్తుంది. 2021- 22 సంవత్సరాలకుగాను తాత్కాలిక సభ్యత్వం పొందే దేశాలను ఎంపిక చేసేందుకు 2020 ఏడాది జూన్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లోనే ఇండియా పోటీ చేయనుండగా, భారత అభ్యర్థిత్వాన్ని ఆసియా-పసిఫిక్ బృందంలోని మొత్తం దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

  FAO డెరైక్టర్ జనరల్‌గా చైనా మంత్రి.

  ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) డెరైక్టర్ జనరల్‌గా చైనా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ ఉప మంత్రి క్యూ డోంగ్యూ ఎన్నికయ్యారు. ఎఫ్‌ఎఓ సారథిగా ఎన్నికైన తొలి చైనా వ్యక్తి క్యూ డోంగ్యూ. 2019, ఆగస్టు 1న క్యూ ఎఫ్‌ఎఓ డెరైక్టర్ జనరల్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.