27 జులై కరంట్ అఫైర్స్

0
33

‘మై బాడీ ! వాట్ ఐ సే గోస్’ పుస్తకావిష్కరణ; ఐడియా, వొడాఫోన్‌ల విలీనానికి కేంద్రం అనుమతి; ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో భారత జట్టుకు అగ్రస్థానం; ఎంబీసీలోకి మరో 35 కులాలు; పశ్చిమబెంగాల్ పేరు మార్పునకు తీర్మానం

1. ‘మై బాడీ ! వాట్ ఐ సే గోస్’ పుస్తకావిష్కరణ

వరల్డ్ విజన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ రూపొందించిన ‘మై బాడీ! వాట్ ఐ సే గోస్’ (నా శరీరం నేను చెప్పినట్లు నడుచుకుంటుంది) అనే పుస్తకంను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో జూలై 25న ఆవిష్కరించారు. బాలికలను లైంగిక వేధింపుల నుంచి కాపాడటం ప్రతి పౌరుని బాధ్యత అనే ప్రచార ఉద్యమంలో భాగంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. వరల్డ్ విజన్ పనిచేసే గ్రామాలు, పాఠశాలల్లో ఈ పుస్తకాన్ని ఉచితంగా అందిస్తామని సంస్థ ప్రతినిధి తబితవాణి తెలిపారు. పిల్లల వ్యక్తిగత శారీరక భద్రత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహ న కల్పించే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు.

2. ఐడియా, వొడాఫోన్‌ల విలీనానికి కేంద్రం అనుమతి

టెలికం సంస్థలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం జూలై 26న తుదిఅనుమతులు మంజూరు చేసింది. దీంతో విలీన సంస్థ మొత్తం 43 కోట్ల మంది యూజర్లతో 35 శాతం మార్కెట్ వాటాతో దేశీయంగా అతి పెద్ద టెలికం కంపెనీగా ఆవిర్భవించనుంది. ప్రస్తుతం 34.4 కోట్ల యూజర్లతో భారతీ ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ డీల్‌కు సంబంధించి జూలై 9న టెలికం శాఖ (డాట్) కొన్ని షరతులతో కూడిన అనుమతులిచ్చింది. దీని ప్రకారం ఇరు సంస్థలు రూ. 7,269 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాయి. విలీనం ప్రక్రియ ఆగస్టు చివరి నాటికి పూర్తి అవుతుందని వొడాఫోన్ గ్రూప్ సీఈవో విటోరియో కొలావో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడే విలీన సంస్థ విలువ సుమారు 23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.5 లక్షల కోట్లు) స్థాయిలో ఉండనుంది. ఇందులో వొడాఫోన్‌కి 45.1 శాతం, ఆదిత్య బిర్లాకు 26 శాతం, ఐడియా షేర్‌హోల్డర్లకు 28.9 శాతం వాటాలు ఉంటాయి. ఈ సంస్థకు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, బాలేశ్ శర్మ కొత్త సీఈవోగాను ఉంటారు. ఇది లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతుంది.

3. ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో భారత జట్టుకు అగ్రస్థానం

అంతర్జాతీయ ఆర్చరీర్యాంకింగ్స్‌లో భారత మహిళా ఆర్చరీ కాంపౌండ్ టీమ్‌కు తొలిసారి అగ్రస్థానం లభించింది. ఈ మేరకు అంతర్జాతీయ ఆర్చరీ సమాఖ్య జూలై 26న ప్రపంచ ర్యాంకింగ్‌‌సను విడుదల చేసింది. భారత ఆర్చరీ జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, లిలీ చాను, ముస్కాన్ కిరార్, దివ్య, మధుమితాలు ఉన్నారు. ఈ ర్యాంకింగ్స్‌లో చైనీస్ తైపీ టీమ్ రెండో స్థానంలో ఉంది. ఇటీవల బెర్లిన్‌లో ముగిసిన ప్రపంచకప్ స్టేజ్-4 టోర్నమెంట్‌లో కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత జట్టు రజతం గెలుచుకుంది. 

4. ఎంబీసీలోకి మరో 35 కులాలు

తెలంగాణలోని మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) కేటగిరీలోకి మరో 35 కులాలను చేరుస్తూ ప్రభుత్వం జూలై 26న ఉత్తర్వులు జారీ చేసింది. జీవన స్థితిగతులు, సామాజిక నేపథ్యం, సంక్షేమం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంబీసీ యాక్ట్-2013 కింద వీటిని చేర్చింది.

ఈ కేటగిరీలో బాలసంతి/బాహుపురి, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దుల, జంగం, జోగి, కాటిపాపల, మొండిబండ/మొండివరు, వంశరాజ్/పిచ్చిగుంట్ల, పాముల, పర్ది, పంబలా, పెద్దమ్మవండ్లు/దేవరవండ్లు/ఎల్లమ్మవండ్లు/ముత్యాలమ్మవండ్లు/దమ్మాలి, వీరముష్టి/వీరబద్రీయ, గుడాలా, కంజారా-బట్ట, రెడ్డిక/కెంపర, మొండెపట్ట, నొక్కర్, పర్కిముగ్గుల, యాట, చొపేమరి, కైకడి, జోషినందివాలాస్, మందుల, కునపలి, పట్ర, పాల ఎక్రాయి/ఎకిల/వ్యాకుల/ఎకిరి/నాయినవారు/పాలేగారు/తొలగరి/కావలి, రాజన్నలా/రాజన్నలు, బుక్కఅయ్యవారు, గొట్రాలా, కస్కిపడి/కస్కిపుడి, సిద్దుల, సికిల్‌గర్/సైకల్‌గర్, అనాథలు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చేర్చారు.

5. పశ్చిమబెంగాల్ పేరు మార్పునకు తీర్మానం

పశ్చిమబెంగాల్ పేరు మార్పునకు ఆ రాష్ట్ర అసెంబ్లీ జూలై 26న తీర్మానం చేసింది. ఈ మేరకు బెంగాలీలో బంగ్లా, ఇంగ్లిష్‌లో బెంగాల్, హిందీలో బంగాల్‌గా మూడు పేర్లుండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బెంగాల్ కోరినట్లు 3 భాషల్లో 3 పేర్లు కాకుండా బెంగాల్‌ను ఒక్క పేరుతోనే సూచించాలని కేంద్రం ఆ రాష్ట్రానికి సూచించింది. ప్రస్తుతం ఆంగ్ల అక్షరమాల ప్రకారం రాష్ట్రాల జాబితాలో పశ్చిమబెంగాల్ పేరు చివరన ఉంది.