26 ఆగష్టు కరెంట్ అఫైర్స్ 2019

  0
  6

  # కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా భల్లా
  # 9వ తరగతి నుంచి ఐచ్ఛిక సబ్జెక్టుగా ‘కృత్రిమ మేధ’
  # ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్తాన్

  కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా భల్లా

  కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్‌కుమార్ భల్లా ఆగస్టు 23న బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న రాజీవ్ గౌబా స్థానంలో భల్లా నియమితులయ్యారు. భల్లా నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 1984 అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన భల్లా గతంలో కేంద్ర విద్యుత్ కార్యదర్శిగా పనిచేశారు.

  9వ తరగతి నుంచి ఐచ్ఛిక సబ్జెక్టుగా ‘కృత్రిమ మేధ’

  మారుతున్న సాంకేతిక పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు వీలుగా ఈ విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి నుంచి కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) ‘కృత్రిమ మేధను’ ఐచ్ఛిక సబ్జెక్టుగా అమలు చేస్తోంది. యోగా, శిశు విద్య అనే వాటిని కూడా ఐచ్ఛికాలుగా ప్రవేశపెట్టాలని గత మార్చిలో బోర్డు నిర్ణయించింది. తొమ్మిదో తరగతిలో ‘కృత్రిమ మేథ’ను తీసుకుంటే పదో తరగతిలో కూడా దాన్నే ఎంచుకోవాలి. తప్పనిసరి సబ్జెక్టులు అయిదు ఉంటాయి. ఆరో సబ్జెక్టుగా ఒక ఐచ్ఛిక సబ్జెక్టును తీసుకుంటారు.

  ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్తాన్

  ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడటంలో పాకిస్తాన్ విఫలమైందంటూ ఆ దేశాన్ని ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఆసియా పసిఫిక్ గ్రూప్ బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో రెండు రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఎఫ్‌ఏటీఎఫ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాలు ఆగస్టు 23న ముగిశాయి. ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి వాటికి నిధులు అందకుండా చేయడంలో పాక్ విఫలమైందని ఎఫ్‌ఏటీఎఫ్ పేర్కొంది. పాకిస్తాన్ ఇప్పటివరకు గ్రే లిస్టులో ఉన్న విషయం విదితమే.