25 కరెంట్ అఫైర్స్ 2019

  0
  15

  # ఫ్రాన్స్‌ గ్రాండ్ ప్రి విజేతగా హామిల్టన్
  # హాలె ఓపెన్ టెన్నిస్‌ విజేతగా ఫెడరర్
  # పాక్‌ను గ్రే జాబితాలోనే కొనసాగిస్తున్నాం: ఎఫ్‌ఏటీఎఫ్

  ఫ్రాన్స్‌ గ్రాండ్ ప్రి విజేతగా హామిల్టన్

  ఫ్రాన్స్‌ గ్రాండ్ ప్రి రేసులో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు.ఫ్రాన్స్‌లో జూన్ 23న జరిగిన ఈ రేసులో 53 ల్యాప్‌లను హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 24 నిమిషాల 31.198 సెకన్లలో ముగించాడు. అతని సహచరుడు బొటాస్ గంటా 24 నిమిషాల 49.254 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటికి 8 రేసులు పూర్తవగా అందులో 6 గెలిచిన హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో 187 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. బొటాస్ 151 పాయింట్లతో, వెటెల్ 111 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

  హాలె ఓపెన్ టెన్నిస్‌ విజేతగా ఫెడరర్

  ఏటీపీ హాలె ఓపెన్ టెన్నిస్‌లో స్విట్జర్లాండ్‌కి చెందిన రోజర్ ఫెడరర్ విజేత గా నిలిచాడు. జర్మనీలోని హాలెలో జూన్ 23న జరిగిన ఫైనల్లో ఫెడరర్ 7-6 (7/2), 6-1 తేడాతో డేవిడ్ గాఫిన్(బెల్జియం)పై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. హాలె టైటిల్‌ను గెలవడం ద్వారా ఫెడరర్ తన కెరీర్‌లో ఒకే టైటిల్‌ను అత్యధిక సార్లు (10) గెలిచినటై్లంది. ఈ టైటిల్‌తో ఫెడరర్ సాధించిన టైటిళ్ల సంఖ్య 102కు చేరింది.

  పాక్‌ను గ్రే జాబితాలోనే కొనసాగిస్తున్నాం: ఎఫ్‌ఏటీఎఫ్

  పాకిస్తాన్‌ను మరోసారి ‘గ్రే జాబితా’లోనే కొనసాగిస్తున్నామని ది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) వెల్లడించింది. అమెరికాలో జూన్ 22న సమావేశమైన ఎఫ్‌ఏటీఎఫ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అక్రమ నగదు చెలామణి, ఉగ్రవాదులకు ఆర్థికసాయం నిలిపివేత విషయంలో పాకిస్తాన్ విఫలమైనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్‌ఏటీఎఫ్ తెలిపింది. తాము నిర్దేశించిన 27 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్ ప్లాన్)ను పాక్ అమలు చేయలేకపోయిందని విమర్శించింది. 2019, సెప్టెంబర్ చివరికల్లా ఈ లక్ష్యాలను చేరుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.