24 మే కరెంటు అఫైర్స్ 2019

  0
  12

  # వృద్ధులకు బ్యాంకు వడ్డీపై టీడీఎస్‌ మినహాయింపు
  # ప్రపంచ వృద్ధి రేటు అంచనాకు ఓఈసీడీ కోత
  # గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ అవార్డు

  వృద్ధులకు బ్యాంకు వడ్డీపై టీడీఎస్‌ మినహాయింపు

  రూ.5 లక్షల వరకు వార్షిక పన్ను ఆదాయం కలిగిన వృద్ధులు బ్యాంకు డిపాజిట్ల వడ్డీపై మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్‌) నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇప్పటి వరకు రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికే ఈ అవకాశం ఉంది. 2019–20 మధ్యంతర బడ్జెట్‌లో రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి పన్ను రాయితీని కేంద్రం ప్రకటించింది

  ఈ నిర్ణయానికి అనుగుణంగా ఫామ్‌ 15హెచ్‌ను సవరిస్తూ సీబీడీటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 87ఏ కింద అన్ని రకాల రాయితీలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నికర ఆదాయం పన్ను పరిధిలో లేని వారి నుంచి ఫామ్‌15 హెచ్‌ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్వీకరించాల్సి ఉంటుంది. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్న వారు తమ బ్యాంకు డిపాజిట్ల వడ్డీ నుంచి టీడీఎస్‌ కోయకుండా, ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఫామ్‌15 హెచ్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

  ప్రపంచ వృద్ధి రేటు అంచనాకు ఓఈసీడీ కోత

  ప్రపంచ వృద్ధి రేటు అంచనాకు ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) కోత పెట్టింది. 2019 ఏడాది వృద్ధి రేటు 3.2 శాతమే ఉంటుందని ఓఈసీడీ పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 3.3 శాతంగా ఉంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, తమ వృద్ధి రేటు అంచనా తగ్గింపునకు ఇదే కారణమని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఈసీడీ విశ్లేషించింది. మౌలిక రంగం, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్, నైపుణ్యత పెంపు వంటి అంశాల్లో పెట్టుబడులు పెరగాలనీ సూచించింది.

  గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ అవార్డు

  గుంటూరుకు చెందిన వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు, మల్లిక స్పైన్ సెంటర్ అధినేత డాక్టర్ జె. నరేష్‌బాబుకు అంతర్జాతీయ అవార్డు లభించింది. కెనడాలో మే 16న జరిగిన కార్యక్రమంలో నరేష్ సహా 11 మందికి డిస్కవరీ అండ్ ఇన్నొవేషన్ అవార్డును అందజేశారు. వెన్నెముక ఆపరేషన్ ఇన్‌ఫెక్షన్స్ పై చేసిన పరిశోధనలకు గాను నరేష్‌కు ఈ అవార్డు దక్కింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఏఓ స్పైన్ ఇంటర్నేషనల్ సంస్థ వెన్నెముకకు సంబంధించి జరిగే ఒరిజనల్ రీసెర్చికు ప్రోత్సాహం ఇచ్చేందుకు డిస్కవరీ అండ్ ఇన్నొవేషన్ అవార్డును అందిస్తోంది.