24 మార్చ్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  6

  # హైదరాబాద్ లో వరి పరిశోధనా సంస్థ
  # నూతన నౌకాదళాధిపతిగా కరమ్‌బీర్‌ సింగ్‌
  # భారత, శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు ‘మిత్రశక్తి-6’

  హైదరాబాద్ లో వరి పరిశోధనా సంస్థ

  హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఫిలిప్పైన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇరి) దక్షిణ భారత ప్రాంతీయ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది. ప్రతిష్ఠాత్మకమైన ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన 25 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందుకు వచ్చింది. దీంతో వ్యవసాయ పరిశోధన స్థానాలకు నిలయమైన రాజేంద్రనగర్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కీలక ఒప్పందం కుదిరింది. ఇరి డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మాథ్యూమోరల్‌, వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ప్రవీణ్‌రావు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.

  నూతన నౌకాదళాధిపతిగా కరమ్‌బీర్‌ సింగ్‌

  భారత నౌకాదళ తదుపరి అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న అడ్మిరల్‌ సునీల్‌ లాంబ మే 30న పదవీ విరమణ పొందనున్నారు. ఆ మరుసటి రోజున కరమ్‌బీర్‌ బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ పేర్కొంది.
  ప్రతిభ ప్రాతిపదికన ఈ నియామకం చేపట్టామని అధికార వర్గాలు తెలిపాయి. ఆ పదవికి అర్హులైనవారిలో అత్యంత సీనియర్‌ను నియమించే సంప్రదాయ విధానాన్ని పాటించలేదని వివరించాయి. వైస్‌ అడ్మిరల్‌ విమల్‌వర్మతో పాటు పలు విభాగాల అధిపతులు కూడా పోటీపడ్డారు. కరమ్‌బీర్‌ సింగ్‌ ప్రస్తుతం విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు.

  భారత, శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు ‘మిత్రశక్తి-6’

  శ్రీలంకలో 26 నుంచి ఏప్రిల్ 8 వరకు జరిగే భారత, శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు ‘మిత్రశక్తి-6’ రంగం సిద్ధమైంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు ఐక్యరాజ్యసమితి ఆదేశాలతో రెండు దేశాల సైన్యం ఉమ్మడి సైనిక శిక్షణ విన్యాసాలను చేపడుతున్నాయి.
  ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యేందుకు దోహద పడుతుందని సైనిక అధికారులు అంటున్నారు. ఈ విన్యాసాల్లో బిహార్‌ రెజిమెంట్‌కు చెందిన మొదటి బెటాలియన్‌ భారత్‌ నుంచి పాల్గొంటుండగా కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ పార్థసారథి రాయ్‌ నేతృత్వం వహిస్తున్నారు.