24 నవంబర్ కరెంట్ అఫైర్స్

  0
  10

  *భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు ఒప్పందాలు
  *ప్రభుత్వరంగ సంస్థగా కశ్మీరు బ్యాంకు
  *ఇక్రిశాట్ శాస్త్రవేత్తకు ఏఎస్ఏ ఫెలోషిప్
  *ఏపీ, తెలంగాణకు ఇండియా టుడే అవార్డు

  *భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు ఒప్పందాలు
  పరస్పర సహకారాన్ని పెంచుకునే లక్ష్యంతో భారత్, ఆస్ట్రేలియా దేశాలు ఐదు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో నవంబర్ 22న సంబంధిత పత్రాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. దివ్యాంగులకు సేవలందించడం, పెట్టుబడులు, శాస్త్రీయ తోడ్పాటు-నవకల్పనలు, సంయుక్త పీహెచ్‌డీ, వ్యవసాయ పరిశోధనలు-విద్య అంశాలకు సంబంధించి ఈ ఒప్పందాలు చేసుకున్నాయి.
  గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పెర్త్‌లోని వెస్టర్న్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం మధ్య వ్యవసాయ పరిశోధనలు-విద్య అంశంలో పరస్పరం సహకారానికి ఉద్దేశించిన ఒప్పందం కుదిరింది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్‌తో సమావేశమైన కోవింద్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. సిడ్నీలో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు.

  *ప్రభుత్వరంగ సంస్థగా కశ్మీరు బ్యాంకు
  జమ్మూకశ్మీరులోని 80 ఏళ్ల క్రితంనాటి జమ్మూకశ్మీరు బ్యాంకును ప్రభుత్వరంగ సంస్థగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అధ్యక్షతన రాష్ట్ర పాలనామండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇతర పీఎసయూకు మాదిరిగా జమ్మూకశ్మీరు సమాచార హక్కు చట్టం, సీవీసీ మార్గదర్శకాలు ఈ బ్యాంకులకు వర్తించేలా సమావేశం తీర్మానం ఆమోదించింది.

  *ఇక్రిశాట్ శాస్త్రవేత్తకు ఏఎస్ఏ ఫెలోషిప్
  ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ కె.వర్షణేకు అమెరికన్ సొసైటీ ఆఫ్ అగ్రానమీ (ఏఎస్ఏ) ఫెలోషిప్-2018 లభించింది. ఈ మేరకు నవంబర్ 22న ఏఎస్ఏ ప్రకటించింది.
  జెనెటిక్స్ గెయిన్స్ విభాగంలో సంచాలకుడిగా పనిచేస్తున్న రాజీవ్ పంటల అభివృద్ధిలో భాగంగా జీనోమిక్స్, మాలిక్యులార్ బ్రీడింగ్ అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. 2018 సంవత్సరానికిగాను ప్రపంచవ్యాప్తంగా 14 మందికి ఏఎస్ఏ ఫెలోషిఫ్ను ప్రకటించగా అందులో ముగ్గురు మినహా మిగిలిన వారందరు అమెరికన్లే ఉన్నారు. భారత్ నుంచి ఈ జాబితాలో రాజీవ్ ఒక్కరికే చోటు దక్కింది.

  *ఏపీ, తెలంగాణకు ఇండియా టుడే అవార్డు
  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డు లభించింది.
  ఈ మేరకు ఢిల్లీలో నవంబర్ 22న జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్లో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ అవార్డులను అంద జేశారు. పర్యాటక రంగంలో ఉత్తమ ప్రగతి సాధించిన ఏపీ పర్యాటకశాఖకు ఇండియా టుడే అవార్డు దక్కింది. అలాగే సుపరిపాలనలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ ‘అత్యంత మెరుగైన పెద్ద రాష్ట్రం’ అవార్డును అందుకుంది. 2017లో రాష్ట్రంలోని పాలనను పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు ఈ అవార్డును ప్రకటించారు.