23 ఆగస్టు కరంట్ అఫైర్స్

  0
  23

  కేరళకు 700 కోట్ల సాయం ప్రకటించిన యూఏఈ; షూటింగ్‌లో సౌరభ్ చౌధరీకి స్వర్ణం; తెలంగాణలో హైజీన్ కిట్లు పంపిణీ; అటల్ నగర్ గా నయా రాయ్‌పూర్ పేరు మార్పు; ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

  1. కేరళకు 700 కోట్ల సాయం ప్రకటించిన యూఏఈ

  వర్ష సంబంధ ఘటనల కారణంగా అతలాకుతలమైన కేరళకు రూ. 700 కోట్లు (100 మిలియన్ డాలర్లు) సాయం చేయనున్నట్లు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఆగస్టు 21న ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 600 కోట్ల సాయాన్ని ఆగస్టు 21న ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే 89,540 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేరళకు ఇచ్చేందుకు కేంద్ర ఆహార, ప్రజా సరఫరా విభాగం ఆమోదం తెలిపింది. ఇప్పటికే కేరళ వరద బాధితుల కోసం ప్రజలు, ఉద్యోగులు, సంస్థలు, పలు రాష్ట్రాలు నుంచి సాయంవెల్లువెత్తుతోంది.

  2. షూటింగ్‌లో సౌరభ్ చౌధరీకి స్వర్ణం

  18వ ఆసియా క్రీడల్లో భాగంగా నిర్వహించిన షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ సౌరభ్ చౌధరీ కి స్వర్ణ పతకం లభించింది. పాలెంబాంగ్‌లో ఆగస్టు 21న జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో 16 ఏళ్ల సౌరభ్ 240.7 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన ఐదో భారతీయ షూటర్‌గా సౌరభ్ గుర్తింపు పొందాడు. ఈ ఈవెంట్‌లో 239.7 పాయింట్లు స్కోరు చేసి తొమోయుకి మత్సుదా (జపాన్) రజతం నెగ్గగా, 219.3 పాయింట్లతో భారత్‌కే చెందిన 29 ఏళ్ల అభిషేక్ వర్మ కాంస్యం దక్కించుకున్నాడు. 

  ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కలీనా గ్రామానికి చెందిన సౌరభ్ 2015లో షూటింగ్ క్రీడలో అడుగుపెట్టాడు. సౌరభ్ ఇప్పటి కే ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో రజతం, ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, ఈ ఏడాది జూన్‌లో జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్‌లో బంగారు పతకాన్ని సాధించాడు.

  మరోవైపు షూటింగ్ 50 మీ ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్‌లో సంజీవ్ రాజ్‌పుత్ రజతం కైవసం చేసుకోగా రెజ్లింగ్ మహిళల ఫ్రీస్టయిల్ 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్ కాంస్య పతకం సాధించింది.

  3. తెలంగాణలో హైజీన్ కిట్లు పంపిణీ

  తెలంగాణలో పభుత్వ పాఠశాలల్లోని 5,90,980 మంది బాలికలకు ఆగస్టు 24 నుంచి ‘హెల్త్ అండ్ హైజీన్ కిట్లు’ పంపిణీచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 21న వెల్లడించింది.ఆగస్టు 31 వరకు జిల్లా పరిషత్, ప్రభుత్వ, మోడల్ స్కూళ్లు, గురుకుల, కేజీబీవీ, పాఠశాలల్లోని బాలికలందరికీ ఈ కిట్లను అందించనున్నారు. హైజీన్ కిట్లలో బాలికలకు కావాల్సిన 14 రకాల వస్తువులుఉంటాయి. ఏడాదికి సరిపడా వస్తువులను ఒకేసారి ఇచ్చేందుకు ఒక్కో విద్యార్థినిపై ఏటా రూ.1,600 ను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మొత్తంగా రూ.100 కోట్ల వరకు వెచ్చించనుంది.

  మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఆగస్టు 25 నుంచి ‘హరిత పాఠశాల-హరిత తెలంగాణ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.

  4. అటల్ నగర్ గా నయా రాయ్‌పూర్ పేరు మార్పు

  ‘అటల్ నగర్’ గా ఛత్తీస్‌గఢ్ నూతన రాజధాని ‘నయా రాయ్‌పూర్’ పేరును మార్పు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 21న నిర్ణయించింది. మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి సేవలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణసింగ్ తెలిపారు. అలాగే కొత్త రాజధానిలో పలు ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులకు వాజ్‌పేయి పేరు పెట్టడంతోపాటు స్మారక స్తూపాన్ని నిర్మించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.

  రాయ్‌పూర్‌లోని సెంట్రల్ పార్కుకు, బిలాస్‌పూర్ యూనివర్సిటీలోని మెడికల్ కాలేజీకి, మార్వా థర్మల్ ప్లాంట్‌కు, రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వేకు వాజ్‌పేయి పేరును పెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు ‘వికాస్ యాత్ర’ రెండో దశకు ‘అటల్ వికాస్ యాత్ర’గా పేరుమార్చింది. ప్రతి సంవత్సరం వాజ్‌పేయి పేరుపై కవులకు జాతీయ స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంతోపాటు ఛత్తీస్‌గఢ్ అవతరణ దినోత్సవం రోజైన నవంబర్ 1న ఉత్తమ పాలన అందించిన పంచాయతీలు, మున్సిపాలిటీలకు ‘అటల్ బిహరీ వాజ్‌పేయి సుహాసన్ అవార్డు’ను అందించనున్నారు. భావితరాలు అటల్ జీవిత విశేషాలు తెలుసుకునేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఛత్తీస్‌గఢ్ కేబినెట్ నిర్ణయించింది.పోఖ్రాన్ అణు పరీక్షలకు గుర్తుగా రాష్ట్రంలోని ఓ బెటాలియన్‌కు ‘పోఖ్రాన్ బెటాలియన్’గా పేరు పెట్టనున్నారు.

  5. ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

  దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూరాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 21న ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా ఎన్‌ఎన్ వోహ్రా స్థానంలో సత్యపాల్ మాలిక్ నియమితులయ్యారు. అలాగే బిహార్ గవర్నర్‌గా మాలిక్ స్థానంలో బీజేపీ సీనియర్ నాయకుడు లాల్జీ టాండన్ బాధ్యతలు చేపట్టారు. హరియాణా నూతన గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబి రాణి మౌర్య నియమితులయ్యారు. అలాగే హరియాణా గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకి త్రిపురకు, త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ మేఘాలయకు, మేఘాలయ గవర్నర్ గంగా ప్రసాద్ సిక్కిం కు బదిలీ అయ్యారు.