21 జూన్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  6

  # జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు
  # ‘ఈడబ్ల్యూఎస్’ రిజర్వేషన్లకు సీఎం ఆమోదముద్ర
  # దేశంలోనే తొలిసారి ఆన్‌లైన్‌లో కోర్టు ఫీజు

  జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు

  ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జూన్ 19న ప్రకటించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా భాగస్వామ్యపక్షాలతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని తెలిపారు. జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలని భావించిన మోదీ ఆ మేరకు 40 మందికి ఆహ్వానం పలికారు. అయితే 21 పార్టీలు మాత్రమే జూన్ 19 నాటి ఈ భేటీకి హాజరుకాగా మరో మూడు పార్టీలు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాయి. ఇది రాజకీయ కమిటీ. వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇందులో సభ్యులుగా ఉంటారు.

  ‘ఈడబ్ల్యూఎస్’ రిజర్వేషన్లకు సీఎం ఆమోదముద్ర

  ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం సంబంధిత ఫైలుపై ఉన్నతాధికారుల సంతకం కూడా పూర్తయింది. ఆ ఫైలుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతకం తీసుకొని తక్షణమే ఉత్తర్వులు జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. ఈ సీట్ల పెంపునకు కూడా ఎంసీఐ తాజాగా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

  దేశంలోనే తొలిసారి ఆన్‌లైన్‌లో కోర్టు ఫీజు

  ఆన్‌లైన్ ద్వారా కోర్టు ఫీజులు చెల్లింపునకు వీలుగా తెలంగాణ హైకోర్టు-స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ల మధ్య ఒప్పందం కుదిరింది. దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని తెలంగాణ హైకోర్టులో అమలు చేయనున్నారు. డిజిటల్ సేవల్ని వినియోగంలోకి తెచ్చే క్రమంలో ఎస్‌బీఐతో కుదిరిన ఒప్పందం మేరకు జూన్ 19న సాయంత్రం హైకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎంఓయూ కుదిరింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రాల సమక్షంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ గీతా ఎస్.పిళ్లైలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు.