20 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  6

  # తేజస్‌లో రక్షణ మంత్రి ప్రయాణం
  # ఏపీ పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్
  # ఐఏఎఫ్ నూతన చీఫ్‌గా రాకేశ్ భదౌరియా

  తేజస్‌లో రక్షణ మంత్రి ప్రయాణం

  పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణించారు. ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపారు. దీంతో తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ నిలిచారు. బెంగళూరులోని హాల్ ఎయిర్‌పోర్టు నుంచి సెప్టెంబర్ 19న దాదాపుగా 30 నిమిషాల సేపు తేజస్ యుద్ధ విమానంలో ఆయన చక్కర్లు కొట్టారు. రాజ్‌నాథ్ వెంట ఎయిర్ వైస్ మార్షల్ ఎన్ తివారీ ఉన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘తేజస్‌లో ప్రయాణం చాలా హాయిగా, సౌకర్యంగా ఉంది. ఎంతో థ్రిల్ పొందాను. నా జీవితంలో ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుంది’ అని అన్నారు. ఆగ్నేయాసియా దేశాలు ఎన్నో తేజస్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు.

  ఏపీ పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా ప్రతిపక్ష టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (ఉరవకొండ) నియమితులయ్యారు. పీఏసీతో పాటు మరో రెండు కమిటీలకు కూడా చైర్మన్లు, సభ్యులను నియమిస్తూ సెప్టెంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంచనాల కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీకి చెందిన పీడిక రాజన్నదొర (సాలూరు-ఎస్టీ), పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీకి చెందిన చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట) నియామకమయ్యారు.

  ఐఏఎఫ్ నూతన చీఫ్‌గా రాకేశ్ భదౌరియా

  భారత వెమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ రాకేశ్ భదౌరియాను నియమించినట్లు సెప్టెంబర్ 19న కేంద్రప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత చీఫ్ బీఎస్ ధనోవా స్థానంలో రాకేశ్ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. 1980లో యుద్ధ విమాన పైలట్‌గా ఉన్న రాకేశ్ 40ఏళ్లలో వివిధ హోదాల్లో పనిచేశారు. 26 రకాల యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది. 2019, మే నెల నుంచి వైమానిక దళం వైస్ చీఫ్‌గా రాకేశ్ పనిచేస్తున్నారు.