20 ఆగస్టు కరంట్ అఫైర్స్

  0
  22

  ఆయుష్మాన్ భారత్ అంబాసిడర్లుగా టీచర్లు; ఆసియా క్రీడలు2018 ప్రారంభం; పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్; దులీప్ ట్రోఫి ప్రారంభం; కేరళలో వర్షాల కారణంగా 324 మంది మృత్యువాత

  1. ఆయుష్మాన్ భారత్ అంబాసిడర్లుగా టీచర్లు

  దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన‘ఆయుష్మాన్ భారత్’ పథకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా స్కూల్ టీచర్లు వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రతి ప్రభుత్వ స్కూల్‌లో ఇద్దరు టీచర్లను ‘హెల్త్ అండ్ వెల్‌నెస్ అంబాసిడర్లు’గా నియమిస్తూ కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేసింది. అంబాసిడర్‌గా నియమితులైన టీచర్లు ఆయుష్మాన్ భారత్‌పై విద్యార్థుల్లో అవగాహన, ఆరోగ్యంపై చైతన్యం కల్పిస్తారు. ఇందుకోసం ముందుగా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, మానవవనరుల అభివృద్ధిశాఖ సంయుక్తంగా అమలు చేయనున్న ఆయుష్మాన్ భారత్‌ను తొలి విడతగా 115 వెనుకబడిన జిల్లాల్లో అమలు చేయనున్నారు. 

  2. ఆసియా క్రీడలు2018 ప్రారంభం

  18వ ఆసియా క్రీడలు-2018 ఇండోనేషియాలోని జకార్తా-పాలెంబాంగ్ నగరాల్లో ఆగస్టు 18న ప్రారంభమయ్యాయి. ఈ క్రీడల ప్రారంభవేడుకల్లో భారత పతాకధారిగా అథ్లెట్ నీరజ్ చోప్రా వ్యవహరించాడు. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరగనున్న ఈ క్రీడల్లో 45 దేశాల నుంచి 11 వేల మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ గేమ్స్‌లో 40 క్రీడాంశాల్లోని 465 ఈవెంట్లకు పోటీనిర్విహ స్తారు. తొలి ఆసియా క్రీడలను 1951లో ఢిల్లీలో నిర్వహించారు. 

  3. పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్

  ఈ మేరకు పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఆ దేశ అధ్యక్ష భవనంలో ఇమ్రాన్ చేత ప్రమాణ స్వీకారం చేయించాడు. ఆగస్టు 17న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌కు 176 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) చీఫ్ షాబాజ్ షరీఫ్‌కు 96 ఓట్లు దక్కాయి.పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుండగా ప్రధానిగా ఎన్నికయ్యేందుకు 172 మంది మద్దతు అవసరం. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన 54 మంది సభ్యులు ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు.

  4. దులీప్ ట్రోఫి ప్రారంభం

  దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ 57వ దులీప్ ట్రోఫీ 2018-19 తమిళనాడులోని దిండిగుల్‌లోని ఎన్‌పీఆర్ కాలేజి మైదానంలో ఆగస్టు 17న ప్రారంభమైంది. భారత దేశవాళీ క్రికెట్ సీజన్ (2018-19)లో తొలి టోర్ని అయిన ఈ ట్రోఫీలో ఇండియా ‘గ్రీన్’ (కెప్టెన్-పార్థివ్ పటేల్), ఇండియా ‘రెడ్’ (కెప్టెన్-అభినవ్ ముకుంద్), ఇండియా ‘బ్లూ’ (కెప్టెన్-ఫైజ్ ఫజల్) జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో పింక్ బంతితో మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. తొలిమ్యాచ్‌లో ఇండియా ‘గ్రీన్’తో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా ‘రెడ్’ తలపడింది. దులీప్ సింహ్ జీ పేరు మీదుగా 1961-62 నుంచి బీసీసీఐ దులీప్ ట్రోఫీని నిర్వహిస్తుంది.

  5. కేరళలో వర్షాల కారణంగా 324 మంది మృత్యువాత

  కేరళలో వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి వర్ష సంబంధ ఘటనల్లో మే 29 నుంచి 324 మంది మృత్యువాత పడినట్లు కేరళ ప్రభుత్వం ఆగస్టు 17న వెల్లడించింది. గత 9 రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటేత్తడంతో 24 గంటల్లోనే (ఆగస్టు 17) 106 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం 14 జిల్లాలు ఉండగా అన్ని జిల్లాల్లోనూ మౌలిక వసతులు, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిరాశ్రయులైన సుమారు 3 లక్షల మంది 2 వేల సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు ఉపశమన బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.