19 మార్చ్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  6

  * గినియా ప్రధానితో రాష్ట్రపతి సమావేశం
  * స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌కు మరో స్వర్ణం
  * వెల్స్ టోర్ని విజేతలుగా థీమ్, బియాంక
  * అఫ్గాన్‌ చారిత్రక విజయం

  గినియా ప్రధానితో రాష్ట్రపతి సమావేశం

  భారత పర్యటనకు వచ్చిన గినియా ప్రధాన మంత్రి ఇబ్రహీమా కస్సారీ ఫోఫనాతో మార్చి 18న ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమావేశమయ్యారు.
  ఈ సందర్భంగా ఇరుదేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. భారత్-గినియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 900 మిలియన్ డాలర్లకు చేరుకుందని రాష్ట్రపతి అన్నారు. గినియాతో అత్యుత్తమైన భాగస్వామ్య దేశాలలో భారత్ ఒకటని పేర్కొన్నారు.

  స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌కు మరో స్వర్ణం

  ఫెడరేషన్‌ కప్‌ జాతీయ సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో అగ్రశ్రేణి స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌ మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఇదివరకే 200మీ. పరుగులో బంగారు పతకం గెలిచిన ఆమె మహిళల 100మీ. పరుగులోనూ పసిడి సొంతం చేసుకుంది.
  11.45 సెకన్లలో రేసును పూర్తి చేసిన తను అగ్రస్థానంలో నిలిచింది. ద్యుతి పతకం గెలిచింది కానీ ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ అర్హత (11.40సె) టైమింగ్‌ను అందుకోలేకపోయింది. 0.05 సెకన్ల తేడాతో అవకాశం కోల్పోయింది.

  వెల్స్ టోర్ని విజేతలుగా థీమ్, బియాంక

  ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్-1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆస్ట్రియాకి చెందిన డొమినిక్ థీమ్, కెనడాకి చెందిన బియాంక ఆండ్రీస్కు విజేతలుగా నిలిచారు.
  అమెరికాలోని కాలిఫోర్నియాలో మార్చి 18న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో డొమినిక్ థీమ్ 3-6, 6-3, 7-5తో నాలుగో సీడ్, గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు. అలాగే మహిళల సింగిల్స్ ఫైనల్లో 18 ఏళ్ల బియాంక 6-4, 3-6, 6-4తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)పై విజయం సాధించింది.

  అఫ్గాన్‌ చారిత్రక విజయం

  అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. ఆ జట్టు తన తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో ఏకైక టెస్టులో అఫ్గాన్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 147 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 29/1తో నాలుగోరోజు, సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన అఫ్గాన్‌ జట్టు మరో రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
  తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులు చేసిన రహ్మత్‌ షా (76) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడగా ఐసానుల్లా (65 నాటౌట్‌) రాణించాడు. ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్‌ కాగా అఫ్గాన్‌ 314 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ 288 పరుగులు సాధించింది