17 మార్చ్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  15

  * తెలంగాణ టూరిజం ఫిల్మ్‌కు జపాన్ అవార్డు
  * ఇన్‌టాక్‌ సభ్యుడిగా వేదకుమార్‌
  * కీర్తిలాల్‌ డైరెక్టరు సీమా మెహతాకు నారీశక్తి పురస్కారం

  తెలంగాణ టూరిజం ఫిల్మ్‌కు జపాన్ అవార్డు

  తెలంగాణ పర్యాటక అందాలకు ‘జపాన్ వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్’ఫిదా అయింది.
  ఒసాకా నగరంలో మార్చి 13, 14 తేదీల్లో జరిగిన వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘థీమ్ సాంగ్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్’కు కల్చరల్ టూరిజం విభాగంలో అవార్డు దక్కింది.మార్చి 14న జరిగిన ముగింపు వేడుకల్లో డాక్యుమెంటరీ ఫిల్మ్ డెరైక్టర్ దూలం సత్యనారాయణ ఈ అవార్డు అందుకున్నారు. తెలంగాణలోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాల అందాలతో రూపొందించిన ఈ పర్యాటక చిత్రం బెస్ట్ ఫిల్మ్ ఇన్ కల్చరల్ టూరిజం విభాగంలో అవార్డు దక్కించుకుంది. తెలంగాణ థీమ్ సాంగ్ చిత్రానికి అవార్డ్ రావడంపై పర్యాటక, సాంస్కృతిక మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి బుర్రా వెంకటేశం హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు తెలంగాణ సొంతమని, ఈ అవార్డుతో ప్రపంచదేశాల నుంచి తెలంగాణకు వచ్చే పర్యాటకులు సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు దూలం సత్యనారాయణకు అభినందనలు తెలిపారు.

  ఇన్‌టాక్‌ సభ్యుడిగా వేదకుమార్‌

  ప్రతిష్ఠాత్మకమైన ఇన్‌టాక్‌ (ఇండియన్‌ నేషనల్‌ ట్రస్టు ఫర్‌ ఆర్ట్‌, కల్చరల్‌ హెరిటేజ్‌) పాలకమండలి సభ్యుడిగా ప్రముఖ పర్యావరణవేత్త మణికొండ వేదకుమార్‌ మరోసారి ఎన్నికయ్యారు.
  దిల్లీలో జరిగిన 2019 ఇన్‌టాక్‌ ఎన్నికల్లో గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఆయన రెండోసారి ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా చారిత్రక సంపదను కాపాడటం కోసం మూడు దశాబ్దాలుగా ఆయన కృషి చేస్తున్నారు.
  వేదకుమార్‌ వృత్తిరీత్యా ఇంజినీర్‌. ప్రవృత్తి రీత్యా చారిత్రిక వారసత్వ సంపద పరిరక్షణ కార్యకర్త. 2001 నుంచి ఆయన ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. 2012 నుంచి 2014 వరకు ఇన్‌టాక్‌ ఏపీ శాఖకు కో-కన్వీనర్‌గా కొనసాగారు. ఇప్పటి వరకు 25పైగా చారిత్రక భవనాలను కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషించారు.

  కీర్తిలాల్‌ డైరెక్టరు సీమా మెహతాకు నారీశక్తి పురస్కారం

  కీర్తిలాల్‌ ఆభరణాల సంస్థ డైరెక్టరు, కథక్‌ నృత్యకారిణి సీమా మెహతా 2018 సంవత్సరానికి నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆమెకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ పురస్కారాన్ని అందజేశారు. 15 ఏళ్లుగా మహిళా సాధికారత కోసం ఆమె కృషి చేస్తున్నారు. పేద పిల్లలకు, యువతులకు ఆమె కథక్‌ నృత్యాన్ని నేర్పిస్తుంటారు. ఈ పురస్కారాన్ని తన మాతృమూర్తికి అంకితమిస్తున్నానని సీమా మెహతా తెలిపారు.