సెప్టెంబర్ 25న ఆయుష్మాన్ భారత్ ప్రారంభం; ముగ్గురు భారత ఆటగాళ్లకు గ్రాండ్‌మాస్టర్ హోదా; భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ వాడేకర్ కన్నుమూత; కంటి వెలుగు పథకం ప్రారంభం; రైతు బీమా పథకం ప్రారంభం
1. సెప్టెంబర్ 25న ఆయుష్మాన్ భారత్ ప్రారంభం
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 25న ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించనున్నారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు వెల్లడించారు.
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు ఏటా రూ. 5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తారు. ఈ పథకం ద్వారా మొత్తం 50 కోట్ల మంది లబ్ది పొందనున్నారు. తొలి విడతలో 10 కోట్ల మందికి ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. ప్రపంచంలోప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా ఆయుష్మాన్ భారత్ నిలిచింది.
మరోవైపు మహిళలపై అత్యాచారాలను అణిచివేస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ అన్నారు. అలాగే గగన్‌యాన్’లో భాగంగా 2022 నాటికి భారతీయులను అంతరిక్షంలోకి పంపిస్తామని, ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని నిషేధించే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. సైనిక శాశ్వత నియామకాల్లో మహిళలకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటామని వె ల్లడించారు.
2. ముగ్గురు భారత ఆటగాళ్లకు గ్రాండ్‌మాస్టర్ హోదా
ముగ్గురు భారత చెస్ ఆటగాళ్లకు గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా లభించింది. ఆగస్టు 15న జరిగిన అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ టోర్నమెంట్లో కేరళకు చెందిన 14 ఏళ్ల నిహాల్ సరీన్, తెలంగాణకు చెందిన 14 ఏళ్ల ఎరిగైసి అర్జున్‌లు జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను సొంతం చేసుకున్నారు. అలాగే ఇటలీలో జరిగిన స్పిలిమ్బెర్గో ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ వెంకటరామన్ మూడో జీఎం నార్మ్ గెల్చుకున్నాడు. దీంతో నిహాల్ భారత్ నుంచి 53వ జీఎంగా, అర్జున్ 54వ జీఎంగా, కార్తీక్ 55వ జీఎంగా అవతరించారు.
3. భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ వాడేకర్ కన్నుమూత
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ అజిత్ లక్ష్మణ్ వాడేకర్ (77) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్లోక్ ఆస్పత్రిలో ఆగస్టు15న తుది శ్వాస విడిచారు.
1941 ఏప్రిల్ 1న బొంబాయిలో జన్మించిన వాడేకర్ 1958లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. 1966లో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 8 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 37 టెస్టులాడి 2,113 పరుగులు, రెండు వన్డేలు ఆడి 73 పరుగులు చేసిన వాడేకర్ 1974లో రిటైరయ్యాడు. మొత్తం ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 237 మ్యాచ్‌ల్లో 47.03 సగటుతో 15,380 పరుగులు చేశాడు.
1990ల్లో అజహరుద్దీన్ సారథ్యంలోని భారత జట్టుకు మేనేజర్ కమ్ కోచ్‌గా వ్యవహరించిన వాడేకర్ 1998-99 మధ్యకాలంలో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. లాలా అమర్నాథ్, చందూ బోర్డె తర్వాత ఆటగాడిగా, సారథిగా, కోచ్‌గా, సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తిగా వాడేకర్ నిలిచారు. మరోవైపు 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీ పురస్కారంను వాడేకర్ పొందారు. అలాగే భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గాను సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు.
4. కంటి వెలుగు పథకం ప్రారంభం
తెలంగాణలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు రూపొందించిన ‘కంటి వెలుగు పథకం’ ప్రారంభమైంది. ఈ మేరకు మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. మొదటిరోజు దాదాపు లక్ష మందికి కంటి పరీక్షలను చేశారు.
ఈ పథకం ద్వారా 3.70 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలను పంపిణీ చేయడంతోపాటు కాటరాక్ట్ ఆపరేషన్లు చేస్తారు. నిరంతరం కంటి సమస్యతో బాధపడే వారి కోసం భవిష్యత్‌లో 150 విజన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పథకంలో భాగంగా అవసరమైన వారికి పంపిణీ చేసే కళ్లద్దాలను ఫ్రాన్స్ కు చెందిన ‘ఎస్సల్లార్’కంపెనీ సరఫరా చేయనుంది. 36 లక్షల కళ్లద్దాలు, రీడింగ్ గ్లాసులను ఎస్సల్లార్ అందిస్తుంది. కంటి వెలుగు కోసం రూ. 106 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకం ప్రపంచంలో అతిపెద్ద సామూహిక కంటి పరీక్షల కార్యక్రమంగా నిలిచింది.
గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి యూనిట్‌గా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. 6 నెలలపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో మొత్తం 799 బృందాలు, 940 మంది మెడికల్ ఆఫీసర్లు, 1,000 మంది కంటి వైద్య నిపుణులు, 33 వేల మంది సిబ్బంది పాల్గొంటారు.
5. రైతు బీమా పథకం ప్రారంభం
తెలంగాణలో రైతులకి రూ. 5 లక్షల జీవిత బీమా కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ‘రైతు బీమా పథకం’ ప్రారంభమైంది. ఈ మేరకు గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆగస్టు 15న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసు గల రైతులు ఎటువంటి పరిస్థితుల్లోనైనా చనిపోతే ఆ వ్యక్తి కుటుంబానికి బీమా పరిహారాన్ని అందజేస్తారు. పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి రైతుకు ఏటా రూ. 2,271 చొప్పున ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తుంది.