16 ఆగస్టు కరంట్ అఫైర్స్

  0
  13

  అత్యంత నివాస యోగ్యమైన నగరంగా పుణే; ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్లకు న్యాసి అవార్డులు; ఛత్తీస్‌గఢ్ గవర్నర్ టాండన్ కన్నుమూత; మహిళల క్రికెట్ జట్టు కోచ్‌గా పవార్; అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్‌గా జోధ్‌పూర్

  1. అత్యంత నివాస యోగ్యమైన నగరంగా పుణే

  దేశంలో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా మహారాష్ట్రలోని పుణే నిలిచింది. పుణే తర్వాత నవీ ముంబై, గ్రేట‌ర్ ముంబై, తిరుపతి నగరాలు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు సులభ జీవనానుకూల నగరాల సూచీ-2018ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ఆగస్టు 13న విడుదల చేసింది. దేశంలోని 111 నగరాలను పరిశీలించి రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్ 27వ స్థానం సంపాదించగా బెంగళూరు 58వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంపూర్ చివరి స్థానంలో నిలవగా కోహిమా, పట్నా నగరాలు కూడా అట్టడుగున నిలిచాయి.

  2. ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్లకు న్యాసి అవార్డులు

  ఐఐటీ హైదరాబాద్‌కి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లకు జాతీయ సైన్స్ అకాడమీ (న్యాసి) యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు-2018లు లభించాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కేటగిరీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మీ బధూలిక న్యాసి అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే బయోమెడికల్, మాలిక్యులర్ బయాలజీ, బయో టెక్నాలజీ కేటగిరీలో బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్ కుమార్ రెన్‌గన్‌కు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు అవార్డుల కమిటీ ఆగస్టు 14న తెలిపింది. ఫెక్సిబుల్ నానో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో కెమికల్స్‌పై పరిశోధన చేస్తున్న సుష్మీ బధూలిక ఆరోగ్య రంగంలో తక్కువ ఖర్చుతో బహుళ ప్రయోజనాలు కలిగిన నానో సెన్సార్ల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో ప్లాస్మోనిక్ నానో స్పేస్ లేబొరేటరీ (పీన్యాస్ ల్యాబ్) అధిపతిగా ఉన్న అరవింద్ కుమార్ రెన్‌గన్‌ కేన్సర్ నానో టెక్నాలజీ రంగంపై పరిశోధనలు చేస్తున్నారు.

  3. ఛత్తీస్‌గఢ్ గవర్నర్ టాండన్ కన్నుమూత

  జన్‌సంఘ్ వ్యవస్థాపక సభ్యుడు, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బల్‌రాంజీ దాస్ టాండన్ (90) కన్నుమూశారు. 2014 జూలై 14 నుంచి ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న టాండన్ గుండెపోటు కారణంగా రాయ్‌పూర్‌లో ఆగస్టు 14న తుది శ్వాస విడిచారు.

  1927 నవంబర్ 1న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన టాండన్ జన్‌సంఘ్ (1951లో స్థాపన) వ్యవస్థాపక సభ్యుల్లోఒకరిగా ఉన్నారు. 1951-1957 మధ్య కాలంలో పంజాబ్ జన్‌సంఘ్ కార్యదర్శిగా ఉన్న టాండన్ 1995-97 మధ్య పంజాబ్ విభాగం బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.1960లో మొదటిసారిగా అమృత్‌సర్ నుంచి ఎమ్మెల్యేగా టాండన్ ఎన్నికయ్యారు. మొత్తం అమృత్‌సర్ నుంచి ఐదుసార్లు, రాజ్‌పురా నుంచి ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే పంజాబ్ డిప్యూటీ సీఎంగా, కేబినేట్ మంత్రిగా ఆయన పనిచేశారు. ఎమర్జెన్సీకాలంలో 1975-77 వరకు 19 నెలల పాటు జైలులో ఉన్నారు. టాండన్ భార్య బ్రిజ్‌పాల్ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.

   
  4. మహిళల క్రికెట్ జట్టు కోచ్‌గా పవార్
   
  భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఈ ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్ వరకు పవార్ కోచ్‌గా కొనసాగుతాడని బీసీసీఐ ఆగస్టు 14న ప్రకటించింది. మహిళల జట్టు కోచ్‌గా ఉన్న తుషార్ అరోథే సీనియర్ ప్లేయర్లతో విభేదాల కారణంగా తన పదవి నుంచి తప్పుకోవడంతో జూలైలో పవార్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంపిక చేశారు.
   
  5. అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్‌గా జోధ్‌పూర్
   
  దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్‌గా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నిలిచింది. జోధ్‌పూర్ తర్వాత జైపూర్, తిరుపతి రైల్వే స్టేషన్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అలాగే అత్యంత పరిశుభ్రమైన రైల్వే జోన్‌గా వాయువ్య రైల్వే (జైపూర్) అగ్రస్థానం కైవసం చేసుకుంది. వాయువ్య రైల్వే జోన్ తర్వాత దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్), తూర్పు తీర రైల్వే (భువనేశ్వర్ )లు వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకు దేశంలో ఉన్న రైల్వే స్టేషన్ లకు పరిశుభ్రత ఆధారంగా ఏటా ఇచ్చే ‘స్వచ్ఛ రైల్, స్వచ్ఛ భారత్’ ర్యాంకుల వివ‌రాల‌ను రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆగస్టు 13న వెల్లడించారు. దేశంలోని రైల్వేలపై సర్వే చేసి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ జాబితాను రూపొందించింది.