15 ఆగస్టు కరంట్ అఫైర్స్

  0
  15

  లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ కన్నుమూత; కాలుష్యం తగ్గిస్తే మరో నాలుగేళ్ల ఆయుష్షు; అత్యంత సంపన్నురాలుగా స్మితా కృష్ణ; రోజర్స్ కప్ విజేత నాదల్; రోజర్స్ కప్ మహిళల విజేత హలెప్

  1. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ కన్నుమూత

  లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ (89) అనారోగ్యం కారణంగాకోల్‌కతాలో ఆగస్టు 13న కన్నుమూశారు. 2004-09 మధ్య కాలంలో లోక్‌సభ స్పీకర్‌గా ఛటర్జీ పనిచేశారు. జెంటిల్మన్ కమ్యూనిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన పదిసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు.

  1929 జూలై 25న అస్సాంలోని తేజ్‌పూర్‌లో సోమనాథ్ ఛటర్జీ జన్మించాడు. ఆయన తండ్రి నిర్మల్ చంద్ర ఛటర్జీ లాయర్‌గా, అఖిల భారత హిందూ మహాసభకు అధ్యక్షుడిగా పనిచేశాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో లా చదివిన ఛటర్జీ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశాడు. లాయర్‌గా పనిచేసే సమయంలో కార్మిక సంఘాలతో కలిసి పనిచేసిన ఆయన 40 ట్రేడ్ యూనియన్లకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1968లో సీపీఎం పార్టీలో చేరిన ఛటర్జీ 1971లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొత్తం పది సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన ఆయన ఒక్కసారి మాత్రమే (1984లో పశ్చిమ బెంగాల్ లోని జాదవ్‌పూర్ నుంచి పోటీచేసి మమతా బెనర్జీ చేతిలో) ఓడిపోయారు. 1989 నుంచి 2004 వరకు లోక్‌సభలో సీపీఎం నాయకుడిగా ఉన్నారు. 2008లో యూపీఏ ప్రభుత్వంపై సీపీఎం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్‌గా ఉన్న చటర్జీ మద్ధతు ఇవ్వకుండా ప్రభుత్వానికి మద్ధతు తెలపడంతో సీపీఎం పార్టీ ఆయనను బహిష్కరించింది. 

  2. కాలుష్యం తగ్గిస్తే మరో నాలుగేళ్ల ఆయుష్షు

  భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను చేరుకుంటే ప్రజల సగటు జీవితకాలాన్ని మరో నాలుగేళ్లు పెంచవచ్చని పరిశోధకులు వెల్లడించారు.ఈ మేరకు దేశంలో వాయు కాలుష్యంపై అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను యూనివర్సిటీ ఆఫ్ షికాగో, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌కి చెందిన పరిశోధకులు ఆగస్టు 13న విడుదల చేశారు. వాయు కాలుష్యం కారణంగా దేశం ప్రతి ఏటా రూ.35 లక్షల కోట్లు నష్టపోతుందని దేశవ్యాప్తంగా 66 కోట్ల మంది అధిక కాలుష్య ప్రాంతాల్లోనివసిస్తున్నారని నివేదిక తెలిపింది.

  ఉద్గారాల పర్యవేక్షణ, కాలుష్యకారకాలపై ప్రజలకు సమాచారం ఇవ్వడం, అదనంగా విడుదలయ్యే ఉద్గారాలపై జరిమానా విధించటం, ఉద్గారాలపై ఎప్పటికప్పడు రెగ్యులేటర్లకు సమాచారం అందించటం, కాలుష్యాన్ని తగ్గించేందుకు యత్నించే పరిశ్రమలపై భారం తగ్గించడం వంటి చర్యల ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు నివేదికలో పేర్కొన్నారు.

  3. అత్యంత సంపన్నురాలుగా స్మితా కృష్ణ

  దేశంలో అత్యంత సంపన్నురాలుగా గోద్రేజ్ గ్రూప్ మూడవ తరం వారసురాలైన స్మితా కృష్ణ నిలిచింది. ఈ మేరకు అత్యంత సంపద కలిగిన 100 మంది మహిళలతో కొటక్ వెల్త్, హురున్‌లు సంయుక్తంగా రూపొందించిన జాబితాను ఆగస్టు 13న విడుదల చేశారు. ఈ జాబితాలో రూ.37,570 కోట్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్న స్మితా గోద్రేజ్ ఇండస్ట్రీస్‌లో ఐదింట ఒక వంతు వాటాను కలిగి ఉంది. ఈ జాబితాలో రూ.30,200 కోట్ల సంపదతో హెచ్‌సీఎల్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) రోషిణి నాడార్ రెండవ స్థానంలో ఉండగా రూ.26,240 కోట్లతో టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ ఇందు జైన్ 3వ స్థానం ఉన్నారు.

  అత్యంత సంపద కలిగిన మహిళల జాబితా-2018 

  ర్యాంకు

  పేరు

  సంపద(రూ. కోట్లలో)

  1

  స్మితా కృష్ణ(గోద్రేజ్ గ్రూప్)

  37,570

  2

  రోషిణి నాడార్(హెచ్‌సీఎల్ సీఈఓ)

  30,200

  3

  ఇందు జైన్(టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్)

  26,240

  4

  కిరణ్ మజుందార్ షా(బయోకాన్ మేనేజింగ్ డెరైక్టర్)

  24,790

  5

  కిరణ్ నాడార్(శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ)

  20,120

  6

  లీనా గాందీ తివారీ

  10, 730

  7

  సంగీతా జిందాల్

  10, 450

  8

  జయశ్రీ ఉల్లాల్

  9,490

  9

  అను అగా

  8,550

  10

  శ్రద్ధా అగర్వాల్

  8,200

  ఈ జాబితాలో మొదటి 10 మంది మహిళా సంపన్నుల కనీస ఆస్తి విలువ రూ. 8000 కోట్లు కాగా మొదటి 100 మంది సగటు ఆస్తి రూ. 4000 కోట్లు. ఈ జాబితాలో రూ. 1000 కోట్లు ఉన్న వారికే మాత్రమే చోటు దక్కింది.

  4. రోజర్స్ కప్ విజేత నాదల్

  రోజర్స్ కప్ ఏటీపీ మాస్టర్స్-1000 టోర్నీలో స్పెయిన్‌కి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ విజేతగా నిలిచాడు. కెనడాలోని టొరంటోలో ఆగస్టు 13న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనలో టాప్ సీడ్ నాదల్ 6-2, 7-6 (7/4)తో గ్రీస్‌కి చెందిన స్టెఫానోస్ సిట్‌సిపాస్‌పై గెలుపొందాడు. 2005, 2008, 2013లలో కూడా 32 ఏళ్ల నాదల్ ఈ టైటిల్‌ను సాధించాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్‌లో ఇది 80వ సింగిల్స్ టైటిల్ కాగా మాస్టర్స్ సిరీస్‌లో 33వ టైటిల్.

  5. రోజర్స్ కప్ మహిళల విజేత హలెప్

  రోజర్స్ కప్ మహిళల విభాగంలో పపంచ నెంబర్ వన్, రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ విజేతగా నిలిచింది. కెనడాలోని టొరంటోలో ఆగస్టు 13న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అమెరికాకి చెందిన స్లోన్ స్టీఫెన్స్ పై 7-6(6), 3-6, 6-4తో గెలుపొందింది. దీంతో ఈ ఏడాది మూడో ఏటీపీ టైటిల్‌ను హలెప్ గెలుచుకున్నట్టయింది.