14 ఆగస్టు కరంట్ అఫైర్స్

  0
  22

  జమ్మూ కశ్మీర్ హైకోర్టు సీజేగా జస్టిస్ గీత; పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ప్రయోగించిన నాసా; ప్రముఖ రచయిత వీఎస్ నైపాల్ కన్నుమూత; విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రెండు విశ్వకర్మ అవార్డులు; టేక్ సొల్యూషన్స్ మాస్టర్స్ విజేత విరాజ్

  1. జమ్మూ కశ్మీర్ హైకోర్టు సీజేగా జస్టిస్ గీత

  జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గీత మిట్టల్ నియమితులయ్యారు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్. ఎన్ వోహ్రా రాజ్‌భవన్‌లో ఆగస్టు 11న గీతా మిట్టల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో కశ్మీర్ హైకోర్టు సీజేగా నియమితులైన తొలి మహిళగా గీతా మిట్టల్ నిలిచారు. 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గీత వ్యవహరిస్తున్నారు. 

  1981లో న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన గీత మిట్టల్ 2004 జూలై 16న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

  2. పార్కర్ సోలార్ ప్రోబ్‌ను ప్రయోగించిన నాసా

  సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు రూపొందించిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ అనే వ్యోమనౌకను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆగస్టు 12న ప్రయోగించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనెవెరాల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి డెల్టా-4 హెవీ రాకెట్ ద్వారా పార్కర్‌ను ప్రయోగించారు. ఈ ఉపగ్రహం 2024 డిసెంబర్ 19 నాటికి సూర్యుడికి సుమారు 60 లక్షల కిలోమీటర్ల దగ్గరకు వెళ్లి సూర్యుడి ఉపరితలంపై ఉన్న కరోనాపై అధ్యయనం చేయనుంది. 

  సూర్యుడిపై ప్రయోగించిన తొలి ఉపగ్రహమైన పార్కర్‌కు సూర్యుడి వాతావరణంలో ఉండే అధిక వేడిని తట్టుకునేందుకు కార్బన్ మిశ్రమ లోహంతో తయారైన ఉష్ణకవచంను అమర్చారు. సూర్యుడి ఉపరితలం(కరోనా)లో 5,500 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండగా పార్కర్‌కు అమర్చిన ఉష్ణకవచం దాదాపు 1,371 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. 7 సంవత్సరాలపాటు అంతరిక్షంలో ప్రయాణించనున్న పార్కర్ గంటకు 6 లక్షల 90 వేల కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు నాసా సుమారు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో పార్కర్ ప్రయోగాన్ని చేపట్టింది.

  3. ప్రముఖ రచయిత వీఎస్ నైపాల్ కన్నుమూత

  భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత, ప్రఖ్యాత నోబెల్, మ్యాన్ బుకర్ బహుమతుల గ్రహీత విద్యాధర్ సూరజ్‌ప్రసాద్ (వీఎస్) నైపాల్ (85) కన్నుమూశారు.అనారోగ్యం కారణంగా లండన్‌లో ఆగస్టు 12న తుదిశ్వాస విడిచారు. 

  1932 ఆగస్టు 17న ట్రినిడాడ్‌లో భారతీయ హిందూ కుటుంబంలో జన్మించిన నైపాల్ ఇంగ్లిష్ భాషలో అత్యంత ప్రవీణుడిగా పేరు తెచ్చుకున్నారు. వీఎస్ నైపాల్ తండ్రి శ్రీప్రసాద్ ట్రినిడాడ్ గార్డియన్ పత్రికకు విలేకరిగా పనిచేసేవారు. 18 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివేందుకు ట్రినిడాడ్ నుంచి లండన్ వచ్చిన నైపాల్ జీవితంలో ఎక్కువ కాలం అక్కడే గడిపారు. 1955లో పాట్రీసియా ఆన్ హేల్‌ను పెళ్లాడిన నైపాల్ 1996లో ఆమె చనిపోవడంతో వయసులో తనకంటే ఎన్నో ఏళ్లు చిన్నదైన, అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న పాకిస్తానీ జర్నలిస్ట్ నదీరాను రెండో పెళ్లి చేసుకున్నారు. 

  మతాన్ని, రాజకీయ నాయకులను, వలసవాదాన్ని విమర్శిస్తూ నైపాల్ రాసిన ముప్పైకి పైగా పుస్తకాలు బాగా ప్రజాధరణ పొందాయి. ఇస్లాం మతవాదంపై అమాంగ్ ద బిలీవర్స్, బియాండ్ బిలీఫ్ వంటి పుస్తకాలను నైపాల్ రాశారు. అలాగే గెరిల్లాస్, ఎ బెండ్ ఇన్ ద రివర్, ఎ వే ఇన్ ద వరల్డ్, ద మైమిక్ మెన్, ది ఎనిగ్మా ఆఫ్ అరైవల్, హాఫ్ ఎ లైఫ్ వంటి ఇతర పుస్తకాలను ఆయన రచించారు. 

  4. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రెండు విశ్వకర్మ అవార్డులు

  విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రతిష్టాత్మకమైన రెండు జాతీయ విశ్వకర్మ అవార్డులు లభించాయి. పరిశ్రమల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఇచ్చే ఈ అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 12న విడుదల చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంజనీరింగ్ షాప్స్ అండ్ ఫౌండ్రీ విభాగానికి చెందిన ఉద్యోగులు టి.వీరలింగం, ఎం.యు.సీతారామయ్య, వి.రమణ, బి.శ్రీరాములు, ఎన్.దయాసాగర్ బృందానికి , స్టీల్ మెల్ట్‌షాప్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఆర్.పట్టాభిరమణ, జె.మహారాణా, టి.విశ్వప్రసాద్, పి.సుబ్బారావు బృందానికి ‘సి’ కేటగిరిలో ఈ అవార్డులను ప్రకటించారు. సెప్టెంబర్ 17న విశ్మకర్మ జయంతి సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.

  5. టేక్ సొల్యూషన్స్ మాస్టర్స్ విజేత విరాజ్

  టేక్ సొల్యూషన్స్ మాస్టర్స్ ఏషియన్ టూర్ చాంపియన్ షిప్‌లో భారత్ గోల్ఫ్ క్రీడాకారుడు విరాజ్ మదప్ప విజేతగా నిలిచాడు. బెంగళూరులో ఆగస్టు 12న జరిగిన తుది రౌండ్ అనంతరం 16/268తో విరాజ్ విజయం సాధించాడు. దీంతో అత్యంత పిన్న వయసులో ఏషియన్ టూర్ టైటిల్ గెలిచిన భారతీయుడిగా 22 ఏళ్ల విరాజ్ గుర్తింపు పొందాడు. విరాజ్ 2017లో ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించాడు.