13 జనవరి కరెంట్ అఫైర్స్ 2019

  0
  7

  *భారత్‌కు నిధుల సాయం పెంపు : ఏడీబీ
  *కలకత్తా హైకోర్టుకు రాధాకృష్ణన్ బదిలీ
  *2021 డిసెంబర్‌లో గగన్‌యాన్ ప్రాజెక్టు
  *జీఎంఆర్‌ హైదరాబాద్‌ విమానాశ్రయానికి సీఎస్‌ఆర్‌ అవార్డు

  భారత్‌కు నిధుల సాయం పెంపు : ఏడీబీ

  భారత్‌కు ఇచ్చే నిధుల సాయాన్ని 2019లో 4.5 బిలియన్ డాలర్ల(రూ.31,500 కోట్లు)కు పెంచనున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) జనవరి 11న ప్రకటించింది.
  ఇందులో 3.5 బిలియన్ డాలర్లు భారత ప్రభుత్వానికి, మరో బిలియన్ డాలర్లు ప్రైవేటు రంగానికి ఇవ్వనున్నట్లు పేర్కొంది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధిని, 2019-20లో 7.6 శాతం వృద్ధిని నమోదుచేస్తుందని ఏడీబీ అంచనా వేసింది.

  కలకత్తా హైకోర్టుకు రాధాకృష్ణన్ బదిలీ

  తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించింది.
  ఈ మేరకు జనవరి 11న కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటి వరకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన డీకే గుప్తా ఇటీవల పదవీ విరమణ చేయడంతో కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళకు చెందిన జస్టిస్ రాధాకృష్ణన్ 2018, జూలై 1న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వచ్చారు.

  2021 డిసెంబర్‌లో గగన్‌యాన్ ప్రాజెక్టు

  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ ప్రాజెక్టును 2021, డిసెంబర్‌లోగా చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ జనవరి 11న వెల్లడించారు.
  ఈ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలోకిపంపే ముగ్గురు వ్యోమగాముల్లో ఒక మహిళా వ్యోమగామి కూడా ఉంటుందని తెలిపారు. ఈ వ్యోమగాములకు పాథమిక శిక్షణ భారత్‌లో, ముఖ్య శిక్షణ రష్యా లేదా ఇతర దేశాల్లో ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు చంద్రయాన్-2ను2019, ఏప్రిల్‌లో చేపట్టనున్నట్లు శివన్ చెప్పారు.

  జీఎంఆర్‌ హైదరాబాద్‌ విమానాశ్రయానికి సీఎస్‌ఆర్‌ అవార్డు

  జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (GHIAL) కు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) అవార్డు లభించింది.
  ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ), 2018 సీఎస్‌ఆర్‌ ఎక్సలెన్స్‌ అవార్డుల్లో ఉత్తమ కార్పొరేట్‌ సంస్థగా అవార్డు దక్కించుకున్నట్లు జీహెచ్‌ఐఏఎల్‌ వెల్లడించింది.