12 సెప్టెంబర్ కరంట్ అఫైర్స్

  0
  22

  విశాఖ పోర్టుకు ఇండియా గ్రీన్ ఎనర్జీ అవార్డు; అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా డేనియల్ జాంగ్; కృష్ణానదిలో లాంచీయాత్ర ప్రారంభం; తెలంగాణకు జాతీయ పురస్కారం; బార్టీ-వాండ్వెఘే జోడీకి మహిళల డబుల్స్ టైటిల్

  1. విశాఖ పోర్టుకు ఇండియా గ్రీన్ ఎనర్జీ అవార్డు

  విశాఖ పోర్టుట్రస్ట్‌కు ఇండియా గ్రీన్ ఎనర్జీ-2018 అవార్డు లభించింది.ఈ మేరకు ఢిల్లీలో సెప్టెంబర్ 10న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు అవార్డును అందజేశారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఉత్తమ ప్రగతి సాధించినందుకు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ ఈ అవార్డుకు విశాఖ పోర్టును ఎంపికచేసింది.

  విశాఖ పోర్టుట్రస్ట్ యాజమాన్యం రూ.57.5 కోట్ల వ్యయంతో 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను విశాఖ విమానాశ్రయ ప్రాంతంలో నెలకొల్పి, మే 2017 నుంచి వాడుకలోకి తీసుకువచ్చింది. ఉత్పత్తి అయిన గ్రీన్ ఎనర్జీలో పోర్టు అవసరాలకు వినియోగించిన తర్వాత మిగులు విద్యుత్‌ను ఏపీఈపీడీసీఎల్‌కు విక్రయిస్తోంది.

  2. అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా డేనియల్ జాంగ్

  ఈ కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆ సంస్థ సీఈఓ డేనియల్ జాంగ్ నియమితులయ్యారు.

  ఈ  మేరకు 2019 సెప్టెంబర్ 10న జాంగ్ పదవీ బాధ్యతలు చేపడతారని అలీబాబా కంపెనీ సెప్టెంబర్ 10న వెల్లడించింది. ప్రస్తుతం అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న జాక్ మా తన పదవీ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. అయితే 2020లో జరిగే సర్వసభ్య సమావేశం వరకు తాను కంపెనీ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లలో ఒకడిగా కొనసాగుతానని చెప్పారు.

  3. కృష్ణానదిలో లాంచీయాత్ర ప్రారంభం

  పర్యాటక ప్రాంతాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను సందర్శించేందుకు తెలంగాణ పర్యాటకశాఖ కృష్ణానదిలో చేపట్టిన లాంచీయాత్ర సెప్టెంబర్ 8న ప్రారంభమైంది.
  రెండు తెలుగు రాష్ట్రాలు, ఐదు జిల్లాల మీదుగా 110 కిలోమీటర్లపాటు లాంచీ ప్రయాణం సాగనుంది. నల్లమల కొండల మధ్య సాగే ఈ యాత్ర కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రభుత్వం రూపొందించింది.
  4. తెలంగాణకు జాతీయ పురస్కారం
  తెలంగాణకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ జాతీయ అవార్డు లభించింది.
  ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెప్టెంబర్ 11న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్థిశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డును అందజేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకం అమలులో మూడో స్థానంలో నిలిచినందుకుగాను తెలంగాణకు ఈ అవార్డు దక్కింది. 
  5. బార్టీ-వాండ్వెఘే జోడీకి మహిళల డబుల్స్ టైటిల్
  ఆష్లీ బార్టీ, కోకో వాండ్వెఘే జోడీకి యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్-2018 లభించింది. అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 9న జరిగిన డబుల్స్ ఫైనల్లో బార్టీ (ఆస్ట్రేలియా), వాండ్వెఘే (అమెరికా)జంట 3-6, 7-6(7/2), 7-6(8/6)తో టిమియా బాబోస్ (హంగేరి), క్రిస్టినా మ్లాదినోవిక్ (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది.