12 మార్చ్ కరెంట్ అఫైర్స్ 2019

  0
  5

  * పినాక రాకెట్‌ పరీక్ష విజయవంతం
  * గిన్నిస్‌ పుస్తకంలోకి ‘వస్త్రదాన్‌’ ఉద్యమం
  * భారత జట్టు విజయం
  * తెలంగాణకు ఇండియన్ స్టాండర్స్ అవార్డు

  పినాక రాకెట్‌ పరీక్ష విజయవంతం

  స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గైడెడ్‌ రాకెట్‌ వ్యవస్థ పినాకను సోమవారం భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ఈ పరీక్ష జరిగినట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది సైన్యంలోని శతఘ్ని విభాగం సత్తాను మరింత పెంచుతుందని వివరించింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం సమకూరుతుందని పేర్కొంది. ఈ రాకెట్‌లో అధునాతన మార్గనిర్దేశ వ్యవస్థ ఉంది. దీనిని హైదరాబాద్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టుకు ఎంవీ రాజశేఖర్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. తాజా ప్రయోగానికి బీహెచ్‌వీఎస్‌ నారాయణమూర్తి నేతృత్వం వహించారు.

  గిన్నిస్‌ పుస్తకంలోకి ‘వస్త్రదాన్‌’ ఉద్యమం

  ‘వస్త్రదాన్‌’ ఉద్యమం ద్వారా మూడు లక్షలకు పైగా దుస్తులను దాతల నుంచి సేకరించడం గిన్నిస్‌ పుస్తకాల్లోకి ఎక్కింది. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన ఉదయ్‌పూర్‌ రాజవంశానికి చెందిన లక్ష్యరాజ్‌ సింగ్‌ మేవర్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. పేదలకు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఆయన దీనిని చేపట్టారు. 120 పాఠశాలలు, 15 కళాశాలలు, 30 స్వచ్చంద సంస్థల నుంచి వీటిని సేకరించారు. మొత్తం 3,29,250 దుస్తులను 76 వేల మందికి పైగా దాతలు అందించారు. పట్టణంలోని పౌరులు, యువతీయువకుల సహృదయతను చాటిచెప్పాలనే ఇందులో వారిని భాగస్వామ్యం చేశామని ఒక ప్రకటనలో లక్ష్యరాజ్‌ సింగ్‌ మేవర్‌ పేర్కొన్నారు.

  భారత జట్టు విజయం

  ఇండో- థాయ్‌ త్రోబాల్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో భారత్‌ 25-23, 25-20 తేడాతో థాయ్‌లాండ్‌పై జయకేతనం ఎగురవేసింది. తొలి సెట్‌లో రెండు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. అయితే కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన భారత్‌ మొదటి సెట్‌ గెలుచుకుంది. రెండో సెట్లో కూడా ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా కూడా అద్భుత ఆటతీరు ప్రదర్శించిన భారత్‌ సెట్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.

  తెలంగాణకు ఇండియన్ స్టాండర్స్ అవార్డు

  తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖకు ప్రతిష్టాత్మక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అవార్డు లభించింది. టీఎస్‌ఐపాస్ ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్లను జారీ చేసినందుకుగాను ఈ అవార్డు దక్కింది. అలాగే నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌సిటీ, నిజామాబాద్ కార్యాలయాలకు కూడా ఈ గుర్తింపు దక్కింది. నాణ్యత నిర్వహణ వ్యవస్థ ధృవీకరణ లెసైన్స్ ను పొందిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.