12 జనవరి కరెంట్ అఫైర్స్ 2019

  0
  12

  *జపాన్‌తో ద్వైపాక్షిక స్వాప్ ఏర్పాటుకు ఆమోదం
  *భారత్ జీడీపీవృద్ధి 7.3 శాతం : ప్రపంచబ్యాంక్
  *తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల్లో హంపీ
  *పరిగిలో ‘ధరణి’ సేవలు ప్రారంభం

  జపాన్‌తో ద్వైపాక్షిక స్వాప్ ఏర్పాటుకు ఆమోదం

  జపాన్‌తో 75 బిలియన్ డాలర్ల మేర ద్వైపాక్షిక స్వాప్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జనవరి 10న ఆమోదం తెలిపింది.
  దీంతో స్వాప్ ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ జపాన్‌తో ఆర్‌బీఐ ఒప్పందం చేసుకునేందుకు అధికారం కల్పించినట్లయింది. ఈ ఒప్పందం కారణంగా కరెన్సీ పరంగా స్థిరత్వం ఏర్పడి, భారత కంపెనీలు విదేశీ నిధులను సులభంగా పొందే అవకాశాలు మెరుగుపడనున్నాయి.

  మరోవైపు నూతన, పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్, ఫ్రాన్స్ మధ్య సాంకేతిక సహకారం పెంపొందించే ఒప్పందానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

  భారత్ జీడీపీవృద్ధి 7.3 శాతం : ప్రపంచబ్యాంక్

  భారత్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో (జీడీపీ) 7.3 శాతం, 2019-20లో 7.5 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచబ్యాంక్ వెల్లడించింది.

  ఈ మేరకు జనవరి 9న ‘‘2019 గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్’’ నివేదికను విడుదల చేసింది. మరోవైపు చైనా 2018-19లో 6.5 శాతం, 2019-20లో 6.2 శాతం వృద్ధిని నమోదుచేస్తుందని ప్రపంచబ్యాంకు తన నివేదికలో పేర్కొంది.

  తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల్లో హంపీ

  ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక జనవరి 10న ప్రకటించిన తప్పనిసరిగా చూడాల్సిన స్థలాల జాబితాలో కర్ణాటకలోని ‘హంపీ’ నగరానికి రెండో స్థానం లభించింది.

  వివిధ దేశాలకు చెందిన 52 పర్యాటక ప్రాంతాలతో రూపొందించిన ఈ జాబితాలో భారత్ నుంచి హంపీకి మాత్రమే చోటు లభించింది. 2016-17 సంవత్సరంలో సుమారు 5.35 లక్షల మంది హంపీని సందర్శించగా వీరిలో 38 వేల మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు.

  ఒకనాటి విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరుబయలు పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. తుంగభద్ర తీరంలో దాదాపు 26 కిలోమీటర్ల పొడవునా ఈ చారిత్రక నగరం విస్తరించి ఉంది.

  పరిగిలో ‘ధరణి’ సేవలు ప్రారంభం

  భూ సంస్కరణల్లో భాగంగా వికారాబాద్‌ జిల్లా పరిగి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 2019 జనవరి 11న ‘ధరణి’ వెబ్‌సైట్‌ సేవలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ప్రభుత్వ సలహాదారు నర్సింగరావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ప్రారంభించారు. సేవలను తహసీల్దార్‌ కార్యాలయానికి అనుసంధానించారు.