10 సెప్టెంబర్ అఫైర్స్ 2019

  0
  14

  # నెల్లూరుకు ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రం
  # విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించాం: ఇస్రో
  # యూఎస్ ఓపెన్ టైటిల్ విజేతగా బియాంకా

  నెల్లూరుకు ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రం

  ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని మైసూరు నుంచి నెల్లూరులోని ఎన్‌సీఈఆర్‌టీ క్యాంపస్‌కు తరలించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్చార్డీ) నిర్ణయించింది. ఈ మేరకు భారతీయ భాషా కేంద్రీయ సంస్థ (సీఐఐఎల్)కు సెప్టెంబర్ 5న ఆదేశాలు జారీ చేసింది. ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని రాష్ట్రానికి తరలించే విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇటీవల చర్చించారు. అనంతరం అధ్యయన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేసేందుకు సహకరించాల్సిందిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి యార్లగడ్డ లేఖ రాశారు.

  విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించాం: ఇస్రో

  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపై దూసుకెళుతూ భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన ‘విక్రమ్’ ల్యాండర్‌ను గుర్తించామని ఇస్రో) చైర్మన్ కె.శివన్ సెప్టెంబర్ 8న ప్రకటించారు. చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు అమర్చిన కెమెరాలు ‘విక్రమ్’కు సంబంధించిన థర్మల్ ఇమేజ్‌లను చిత్రీకరించాయని వెల్లడించారు. ఇస్రో 2019 ఏడాడి జూలై 22న జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే.

  యూఎస్ ఓపెన్ టైటిల్ విజేతగా బియాంకా

  యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా కెనడాకి చెందిన బియాంకా ఆండ్రీస్కూ అవతరించింది. అమెరికాలోని న్యూయార్క్‌లో సెప్టెంబర్ 8న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 15వ సీడ్ బియాంక 6-3, 7-5తో 8వ సీడ్, 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా)పై విజయం సాధించింది. దీంతో కెనడా తరఫున గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా బియాంకా రికార్డు నెలకొల్పింది. చాంపియన్ బియాంకాకు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)… రన్నరప్ సెరెనాకు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.