10 జనవరి కరెంట్ అఫైర్స్ 2019

  0
  14

  # సౌర వ్యవస్థ ఆవల మరో కొత్తగ్రహం గుర్తింపు
  # ఫిబ్రవరి 1న తాత్కాలిక కేంద్ర బడ్జెట్!
  # సంగీత నృత్య అకాడమీకి ఛైర్మన్‌గా వందేమాతరం శ్రీనివాస్‌

  సౌర వ్యవస్థ ఆవల మరో కొత్తగ్రహం గుర్తింపు

  మన సౌర వ్యవస్థ ఆవల మరో కొత్త గ్రహాన్ని గుర్తించినట్లు జనవరి 8న నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
  ఈ గ్రహం భూమికి సూమారు 53 కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి మాదిరి ప్రకాశవంతమైన ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త గ్రహానికి హెచ్‌డీ 21749బీ అని పేరు పెట్టారు. మన సౌర వ్యవస్థ ఆవల ఉన్న గ్రహాల కోసం అన్వేషణ సాగిస్తున్న టెస్ (ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్) సాయంతో హెచ్‌డీ 21749బీ గ్రహాన్ని కనుగొన్నారు.

  2018, ఏప్రిల్‌లో టెస్‌ను లాంచ్ చేయగా అది ఇప్పటివరకు మన సౌర వ్యవస్థ ఆవల 3 గ్రహాలను కనుగొంది. తాజా గ్రహం పేరు హెచ్‌డీ 21749బీ కాగా ఇంతకుముందు కనుగొన్న గ్రహాలపేర్లు పై మెన్సె బీ, ఎల్‌హెచ్‌ఎస్ 3844బీ. ఈ 3 గ్రహాల్లోకెల్లా ప్రస్తుత గ్రహమే అధిక కక్ష్య కాలాన్ని కలిగి ఉంది.

  ఫిబ్రవరి 1న తాత్కాలిక కేంద్ర బడ్జెట్!

  వచ్చే ఏప్రిల్-మేనెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తున్నది. సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంటాయి. మోదీ ప్రభుత్వం కూడా ఈ నెల 31 నుంచి వచ్చేనెల 13 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించి, ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు ముగియగానే ప్రస్తుత పార్లమెంట్ పదవీకాలం కూడా పూర్తయినట్లే లెక్క. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 31న ప్రసంగిస్తారు. అదే రోజు ఆర్థిక సర్వే నివేదికను కూడా ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతుంటాయి. కానీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకే విడతగా సమావేశాలు ముగించి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడం, త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో భారీగా తాయిలాలను ప్రకటించడానికి మోదీ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.

  సంగీత నృత్య అకాడమీకి ఛైర్మన్‌గా వందేమాతరం శ్రీనివాస్‌

  రాష్ట్ర సంగీత నృత్య అకాడమీకి ఛైర్మన్‌గా వందేమాతరం శ్రీనివాస్‌ను నియమిస్తూ పర్యాటక, సాంస్కృతికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీచేశారు.
  చంద్రబాబుకు కృతజ్ఞతలు..
  జానపద అకాడమీ ఛైర్మన్‌ పొట్లూరి హరికృష్ణ, నృత్య అకాడమీ ఛైర్మన్‌ వందేమాతరం శ్రీనివాస్‌, నాటక అకాడమీ ఛైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తమను ఛైర్మన్లుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావడానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ‘చంద్రన్న నాటకవరం’ గోడపత్రికను విడుదల చేశారు.