09 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 2019

  0
  10

  # అంతర్జాతీయ ఐపీ సూచీలో భారత్‌కు 36వ స్థానం
  # విజయ డెయిరీకి జాతీయ అవార్డు
  # ఈజీఏటీ కప్‌లో మీరాబాయి చానుకు స్వర్ణం
  # వృద్ధ కళాకారుల పింఛన్‌ 3వేలకు పెంపు

  అంతర్జాతీయ ఐపీ సూచీలో భారత్‌కు 36వ స్థానం

  అంతర్జాతీయ మోథో సంపత్తి హక్కుల (ఐపీ) సూచీలో భారత్ 36వ స్థానంలో నిలిచింది.
  అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ) ఫిబ్రవరి 7న ఆవిష్కరించిన ఈ సూచీలో అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు మొదటి తొలి ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. 45 ప్రమాణాల ప్రాతిపదికన, 50 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై విశ్లేషణ ఆధారంగా ఐపీ సూచీని రూపొందించారు. పేటెంట్, ట్రేడ్‌మార్క్, కాపీరైట్, వాణిజ్య రహస్యాల రక్షణ వంటి అంశాలు ఈ 45 ప్రమాణాల్లో ఉన్నాయి. 2018 ఐపీ సూచీలో భారత్ 44వ స్థానం దక్కించుకోగా, తాజాగా ఇది 8 స్థానాలు మెరుగుపడి 36కు చేరింది.

  విజయ డెయిరీకి జాతీయ అవార్డు

  దిల్లీలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ సమ్మిట్‌లో తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు దక్కింది. కేంద్ర ఆహార భద్రత, రక్షణ శాఖ 20 కేటగిరీల్లో వివిధ సంస్థలకు ఈ పురస్కారాలు ప్రదానం చేసింది.
  ఇందులో సాంఘిక సంక్షేమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు స్వచ్ఛమైన పాలు అందిస్తున్నందుకు విజయ డెయిరీని అవార్డు వరించింది.
  దిల్లీలో ఫిబ్రవరి 8న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని చౌబే, సురేష్‌ ప్రభు చేతుల మీదగా తెలంగాణ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ శ్రీనివాసరావు, సీనియర్‌ పర్సనల్‌ అధికారి మల్లయ్య అవార్డు అందుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో విజయ డెయిరీ విజయవంతమైందనడానికి ఇది నిదర్శనమని డెయిరీ ఎండీ శ్రీనివాసరావు అన్నారు.

  ఈజీఏటీ కప్‌లో మీరాబాయి చానుకు స్వర్ణం

  థాయిలాండ్‌లో ఫిబ్రవరి 7న జరిగిన ఈజీఏటీ కప్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు స్వర్ణ పతకం లభించింది.
  మహిళల 49 కేజీల విభాగంలో చాను స్నాచ్‌లో 82 కేజీలు, క్లీన్ అండ్‌లో జర్క్‌లో 110 కేజీలు కలిపి మొత్తం 192 కిలోల బరువెత్తింది. ఈజీఏటీ కప్‌ను ద్వితీయ శ్రేణి ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీగా వ్యవహరిస్తారు.

  వృద్ధ కళాకారుల పింఛన్‌ 3వేలకు పెంపు

  వృద్ధ కళాకారుల పింఛన్‌ను ప్రభుత్వం రెండింతలు చేసింది. నెలకు రూ.1,500 ఉండగా దీన్ని రూ.3వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. జనవరి నుంచి ఈ పెంపు వర్తింపజేస్తారు. లబ్ధిదారుల ఎంపికకు సర్కారు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 58 ఏళ్లు నిండి, వృత్తిపరంగా కళాకారుడై, దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఏ ఇతర పింఛన్‌నూ పొందుతూ ఉండరాదు.