09 నవంబర్ కరెంట్ అఫైర్స్

  0
  7

  *పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఆంధ్ర ప్రదేశ్
  *ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రాయుడు విరమణ
  *ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సౌరభ్‌కు స్వర్ణం
  *దీపావళి సందర్భంగా ఐరాస స్టాంపుల విడుదల

  *దీపావళి సందర్భంగా ఐరాస స్టాంపుల విడుదల
  దీపావళి సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఐక్యరాజ్యసమితి నవంబర్ 7న రెండు స్టాంపులను విడుదల చేసింది.
  ఈ స్టాంపులలో ఒక దానిపై హ్యాపీ దీవాళి అనే అక్షరాలతో కూడి లైటింగ్‌లో ఉన్న ఐరాస ప్రధాన కార్యాలయం, మరోక దానిపై దీపాలు ఉన్నాయి. 1.15 డాలర్ల విలువైన ఈ స్టాంపులను అంతర్జాతీయ ఎయిర్‌మేల్ లెటర్లకు ఉపయోగించుకోవచ్చు. ‘హ్యాపీ దీవాళి. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారతీయులు జరుపుకొనే వెలుగుల పండుగ సందర్భంగా యూన్ స్టాంప్స్’ అని ఈ సందర్భంగా ఐరాస ట్వీట్ చేసింది.

  *ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సౌరభ్‌కు స్వర్ణం
  ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సౌరభ్ చౌదరి స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు.
  కువైట్‌లో నవంబర్ 8న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ విభాగం ఫైనల్లో సౌరభ్ 239.8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌లో అర్జున్ (భారత్, 237.7 పాయింట్లు) రజతం, హువాంగ్ వై టి (చైనీస్‌తైపీ, 218 పాయింట్లు) కాంస్యం గెలుచుకున్నారు.

  మరోవైపు టీమ్ విభాగంలో సౌరభ్, అర్జున్ సింగ్ చీమా, అన్‌మోల్ జైన్‌లతో కూడిన భారత జట్టు 1731 పాయింట్లతో పసిడి పతకం దక్కించుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ 10 (3 స్వర్ణ, 5 రజత, 2 కాంస్య) పతకాలు సాధించింది.

  *ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రాయుడు విరమణ
  టీమిండియా వన్డే బ్యాట్స్ మెన్ , హైదరాబాదీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి విరమించాడు.
  టి20, వన్డే ఫార్మాట్లపై మరింత దృష్టి పెట్టేందుకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు నవంబర్ 3న రాయుడు ప్రకటించాడు. రంజీ ట్రోఫీ సహా బహుళ రోజుల మ్యాచ్లకు వీడ్కోలు పలికిన రాయుడు ఇకపై అంతర్జాతీయ, దేశవాళీల్లో వన్డేలు, టి20లు మాత్రమే ఆడతాడు. హైదరాబాద్ తరఫున 2001-02 సీజన్లో రంజీ అరంగేట్రం చేసిన రాయుడు… 17 ఏళ్లలో 97 మ్యాచ్లు ఆడి 6,151 పరుగులు చేశాడు. 2013లో వన్డే, 2014లో టి20 జాతీయ జట్లకు ఎంపికయ్యాడు.

  *పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఆంధ్ర ప్రదేశ్
  పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒకప్పుడు ముందంజలో ఉన్న మహారాష్ట్రను వెనక్కునెట్టి మన రాష్ట్రం ముందుకు దూసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే 100 టన్నుల పండ్లలో 15 టన్నులు మన రాష్ట్రం నుంచే వస్తున్నాయి. ఏటా 1.40 లక్షల టన్నుల పండ్లు ఏపీ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో అరటి, మామిడి పంటల వాటాయే మూడింట రెండొంతులుగా ఉంది. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగును కోటి ఎకరాలకు చేర్చాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు సూక్ష్మ సేద్య సాగు పెరుగుతుండటం కూడా ఉత్పత్తి పెంపుదలకు దోహదపడుతోంది. ద్రాక్ష, బొప్పాయి, పైనాపిల్‌, దానిమ్మ, తైవాన్‌ జామ, పుచ్చ, కర్బూజనే కాకుండా.. విశాఖపట్నంలో యాపిల్‌, రాయలసీమలో ఖర్జూర సాగుపైనా రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యాన ఉత్పత్తిలో రాష్ట్రం ప్రథమస్థానంలో నిలుస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్వీట్‌ చేశారు. ఆధునిక సాంకేతిక విధానాలను అందిపుచ్చుకుంటూ సాగుతుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు.