05 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ 2018

  0
  13

  *కికెట్ నుంచి గంభీర్ విరమణ
  *మోడ్రిచ్‌కు ‘గోల్డెన్ బాల్’ పురస్కారం
  *అమెరికా రక్షణ మంత్రితో నిర్మలా సమావేశం
  *విశాఖ జైలులో ‘సుధార్’ ప్రారంభం

  *కికెట్ నుంచి గంభీర్ విరమణ
  భారత క్రికెట్ ఆటగాడు గౌతమ్ గంభీర్(ఢిల్లీ) క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి విరమించనున్నట్లు డిసెంబర్ 4న ప్రకటించాడు. డిసెంబర్ 6 నుంచి ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఆంధ్ర జట్టుతో జరిగే రంజీ మ్యాచ్‌లో తాను ఆఖరి సారిగా బరిలోకి దిగుతానని వెల్లడించాడు. 2003లో ఏప్రిల్‌లో తొలిసారి భారత జట్టు తరఫున ఆడిన గంభీర్… 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో భారత టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

  అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేలకు పైగా పరుగులు చేసిన గంభీర్ 2016 నవంబర్‌లో రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌పై తన ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు. గంభీర్ టి20 కెరీర్ 2012లో, వన్డే కెరీర్ 2013లోనే ముగిసింది.

  *మోడ్రిచ్‌కు ‘గోల్డెన్ బాల్’ పురస్కారం
  క్రోయేషియాకి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు లుకా మోడ్రిచ్‌కి 2018 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ బాల్’ (వరల్డ్ బెస్ట్ ప్లేయర్) పురస్కారం లభించింది.
  ఈ మేరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో డిసెంబర్ 4న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. మరోవైపు తొలిసారి(2018)గా ప్రవేశపెట్టిన మహిళల విభాగంలో నార్వే స్ట్రయికర్ అడా హెగెర్‌బెర్గ్ గోల్డెన్ బాల్ పురస్కారాన్ని అందుకున్నారు.

  *అమెరికా రక్షణ మంత్రితో నిర్మలా సమావేశం
  అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్‌తో భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అమెరికాలోని పెంటగాన్‌లో డిసెంబర్4న సమావేశమయ్యారు.
  సమావేశంలో భాగంగా రక్షణ, భద్రతా సంబంధాల వంటి విషయాలపై ఇరు దేశాల మంత్రులు చర్చలు జరిపారు. రక్షణ రంగంలో అమెరికాను భారత్ ముఖ్యమైన భాగస్వామిగా పరిగణిస్తోందని నిర్మలా ఈ సందర్భంగా అన్నారు.

  *విశాఖ జైలులో ‘సుధార్’ ప్రారంభం
  విశాఖపట్నం కేంద్ర కారాగారంలో వస్తు విక్రయ కేంద్రం ‘సుధార్’ ను జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ ఇండ్ల శ్రీనివాసరావు డిసెంబర్ 3న ప్రారంభించారు.
  సుధార్ కేంద్రంలో జైలు లోపల పరిశ్రమల్లో ఖైదీలు తయారుచేసిన కలర్ డర్రీస్, డోర్ మేట్స్, యోగా మేట్స్, బెడ్‌షీట్లు, క్లాత్ సంచులు, సెంటెడ్ పినాయిల్, బేకరీ పదార్థాలు, కూరగాయలు విక్రయించనున్నారు.