04 నవంబర్ కరెంట్ అఫైర్స్

  0
  12

  14న జీఎస్ఎల్వీ-మార్క్3 ప్రయోగం
  జనవరి నుంచి ఆర్థిక గణన
  రష్యా చందమామ
  తాలిబన్ల ‘గాడ్‌ఫాదర్’ హత్య
  అచేతనంగా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్

  *14న జీఎస్ఎల్వీ-మార్క్3 ప్రయోగం
   భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. జీఎస్ఎల్వీ-మార్క్3డీ2 వాహక నౌక ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ నెల 14 సాయంత్రం 5.08 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ వాహక నౌక 3,600 కిలోల బరువు గల జీశాట్-29 సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. దేశ కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతానికి 2017లో ఇస్రో జీశాట్-19 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపింది. ఇదే లక్ష్యంతో ఈ నెల 14న జీశాట్-29 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. షార్‌లో ప్రస్తుతం జీఎస్ఎల్వీ-మార్క్3డీ2 వాహక నౌక అనుసంధాన కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి.

  *జనవరి నుంచి ఆర్థిక గణన
  దేశంలో 7వ ‘ఆర్థిక గణన’ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ వీలైనంత వేగంగా ఈ క్రతువును పూర్తిచేయాలని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. 2013-14లో ఆరో ‘ఆర్థిక గణన’ జరిగింది. సిబ్బందికి ట్యాబ్‌లు అందించి సేకరణ సమయంలోనే వివరాలను కంప్యూటరీకరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ప్రణాళిక శాఖ అధికారులకు దిల్లీలో ప్రత్యేక శిక్షణనిస్తోంది.

  *రష్యా చందమామ
  రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లోగల ఒబ్వోడ్నీ కాలువలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చందమామ ప్రతిరూపమిది. చంద్రుడి ఉపరితలాన్ని పోపలిన పెద్ద బంతిని తయారుచేసి, త్వరలో ఆడంబరంగా నిర్వహించబోయే ‘లైట్ల’ వేడుకలో అందర్నీ ఆకర్షించాలని స్థానిక యంత్రాంగం ఈ ఏర్పాటు చేసింది.

  *తాలిబన్ల ‘గాడ్‌ఫాదర్’ హత్య
  తాలిబన్ల గాడ్‌ఫాదర్‌గా పేరుకెక్కిన ప్రముఖ పాకిస్థానీ ఇస్లాం మత బోధకుడు మౌలానా సమీ ఉల్ హఖ్ (82) హత్యకు గురయ్యాడు.
  పాకిస్థాన్‌లో రావల్పిండిలోని హఖ్ నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి హత్యచేశారు. హఖ్ నడిపిన దారుల్ ఉలూమ్ హఖ్ఖానియా అనే మదర్సా ‘జీహాద్ విశ్వవిద్యాలయం’గా పేరొందింది. గతంలో పాక్ పార్లమెంటుకు హఖ్ రెండు సార్లు ఎన్నికయ్యాడు. దిఫా-ఎ-పాకిస్థానీ పేరుతో ఏర్పాటైన ఓ కూటమికి ఛైర్మన్‌గా పనిచేశాడు.

  *అచేతనంగా కెప్లర్ స్పేస్ టెలిస్కోప్
  అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్(కె2) అచేతనంగా మారింది.
  విశ్వంలో మరిన్ని పరిశీలనలు సాగించేందుకు అవసరమైన ఇంధనం కెప్లర్లో లేదని అక్టోబర్ 31న నాసా వెల్లడించింది. 2009 మార్చి 6న ప్రయోగించిన ఈ టెలిస్కోప్ ఇప్పటివరకు సుమారు 2,600కి పైగా కొత్త గ్రహాలను గుర్తించింది. కెప్లర్ మిషన్ వ్యవస్థాపకులు విలియం బ్రూకీ మాట్లాడుతూ ‘35 ఏళ్ల కింద సౌర వ్యవస్థకు అవతల ఉన్న ఒక్క గ్రహం ఉనికి కూడా మాకు తెలియదు. కానీ కెప్లర్ తెలిపిన వివరాల ద్వారా భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయడానికి పునాది పడింద’ని పేర్కొన్నారు.