04 జులై కరెంట్ అఫైర్స్ 2019

  0
  12

  # భారత్‌కు నాటోతో సమాన హోదా
  # ఇస్టా ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కేశవులు
  # మెడికల్ కౌన్సిల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

  భారత్‌కు నాటోతో సమాన హోదా

  భారత్‌కు నాటోతో సమాన హోదా ఇచ్చేందుకు సంబంధించిన శాసనసభ నిబంధనకు అమెరికా సెనేట్ జూలై 2న ఆమోదం తెలిపింది. దీంతో అమెరికా నాటో మిత్రపక్ష దేశాలైన ఇజ్రాయిల్, దక్షిణ కొరియా దేశాల సరసన భారత్ నిలవనుంది. దీనివల్ల భారత్-అమెరికా దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించేందుకు అవకాశముంటుంది. హిందూ మహాసముద్రంలో భారత్-అమెరికాల మధ్య రక్షణ సహకారం మరింత పెరగడంతో పాటు, మానవతా సహాయం, ఉగ్రవాద నిర్మూలన, సముద్ర ప్రాంతంలో భద్రత వంటివి పెంపొందించడానికి ఈ చట్టం దోహదపడుతుంది. 2020 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ రక్షణ అధికార చట్టం (ఎన్‌డీఏఏ) బిల్లులో భారత్‌కు నాటోతో సమాన హోదా ఇచ్చే ప్రతిపాదనను పొందుపరిచారు.

  ఇస్టా ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కేశవులు

  అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఇస్టా) ఉపాధ్యక్షుడిగా తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డెరైక్టర్ డాక్టర్ కె.కేశవులు ఎన్నికయ్యారు. ఇస్టా కార్యనిర్వాహక కమిటీ ఎన్నిక జూలై 2న ఏకగ్రీవంగా జరిగింది. 1924లో ఏర్పాటైన ఇస్టాలో భారతదేశానికి ఉపాధ్యక్ష పదవి లభించడం ఇదే మొదటిసారి. ఇస్టా సంస్థ ఉపాధ్యక్షుడిగా 2019-22 వరకు కేశవులు కొనసాగుతారు. సంస్థ నిబంధనల ప్రకారం ఇస్టా ఉపాధ్యక్షుడే తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అంటే 2022-24 మధ్య ఇస్టా అధ్యక్షుడిగా డాక్టర్ కేశవులు బాధ్యతలు స్వీకరించనున్నారు. జూన్ 26 నుంచి హైదరాబాద్ కేంద్రంగా హెచ్‌ఐసీసీలో 32వ అంతర్జాతీయ విత్తన సదస్సు- 2019ను నిర్వహిస్తున్నారు.

  మెడికల్ కౌన్సిల్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

  ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సవరణ బిల్లు-2019కు జూలై 2న లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే వైద్య విద్యారంగంలో సమూల సంస్కరణలకు వీలవుతుందని బిల్లుపై చర్చ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ అన్నారు.

  మంత్రి తెలిపిన వివరాల ప్రకారం

  – మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) ఏర్పాటవుతుంది
  – 2019, ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు అమలవుతుంది
  – దేశంలో వైద్య విద్యను మెరుగుపరిచేందుకు నూతన వ్యవస్థ ఉపయోగపడుతుంది
  – ఎన్‌ఎంసీలోని బోర్డ్ ఆఫ్ గవర్నర్ల సంఖ్య ఏడు నుంచి 12కు పెరగనుంది. ఈ విధానంతో కళాశాలల మంజూరు, పోస్టుల భర్తీ, విద్యార్థుల ప్రవేశాల తీరులో జవాబుదారీతనం, పారదర్శకత పెరిగాయి.