హైదరాబాద్ లో సీఐఐ సమావేశం

  0
  7

  తెలంగాణ పథకాలు భేష్‌ – రాష్ట్ర వృద్ధి రేటుకు అవే కారణం
  హైదరాబాద్‌లో వ్యాపార వృద్ధికి అనువైన వాతావరణం

  తెలంగాణ ప్రభుత్వం 45,000 చెరువుల్లో పూడిక తీయడానికి ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ, తాగునీటి పథకమైన మిషన్‌ భగీరథ, కల్యాణలక్ష్మి, రైతుబంధు పథకాలు బాగున్నాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు డా.వి.కె.సారస్వత్‌ ప్రశంసించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కేవలం ఐదేళ్లలోనే రెండంకెల వృద్ధిరేటు నమోదు చేయడం మామూలు విషయం కాదన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే వృద్ధి రేటుకు కారణమన్నారు.

  ‘2017-18 సంవత్సరానికి రాష్ట్ర జీఎస్‌డీపీ 14 శాతం వృద్ధి రేటుతో 7.33 లక్షల కోట్లుగా ఉంది. ఇంత నమోదు చేయడం అద్భుతం. స్థూల విలువల ఆధారిత ఉత్పత్తి విభాగంలో ప్రాథమిక రంగంలో తెలంగాణది 9.2 శాతం. భారత వృద్ధి రేటు కేవలం 5.2 శాతమే. సుస్థిరాభివృద్ధి (సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గ్రోత్‌-ఎస్‌డీజీ) సూచీలో తెలంగాణ 64 పాయింట్లు సాధించి 9వ స్థానంలో నిలవగా జాతీయ సగటు 57 పాయింట్లే’ అని డా.సారస్వత్‌ పేర్కొన్నారు.

  కృత్రిమ మేథ, బ్లాక్‌ చైన్‌ వంటి అంశాలను కీలకంగా భావించి మున్ముందుకు సాగాలని ఉద్బోధించారు. ఆరోగ్యం, పర్యాటకం, సేవలు, విద్య, సమాచారం, సాంకేతిక రంగాల్లో మరింత వృద్ధికి చర్యలు తీసుకుంటే తెలంగాణ అన్నింటా దూసుకుపోతుందన్నారు. హైదరాబాద్‌ నగరంలో వ్యాపార వృద్ధికి అనువైన వాతావరణం ఉందని రాబోయే రోజుల్లో నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

  రాష్ట్రంలో ఒక్కటైనా ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణలో ఉన్న ఆయుధ ఫ్యాక్టరీకి ప్రభుత్వం నీటిని కేటాయించకపోవడం సరికాదన్నారు. హైదరాబాద్‌ తాజ్‌కృష్ణా హోటల్‌లో బుధవారం జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ-సీఐఐ) తెలంగాణ వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.