హైదరాబాద్ లో భారత విత్తన సదస్సు

  0
  9

  నేషనల్‌ సీడ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఎస్‌ఏఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరుగుతోన్న భారత విత్తన సదస్సు ముగిసింది.

  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంజయ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)లో సభ్యదేశంగా చేరినప్పుడే విత్తన ఎగుమతులను 10 శాతానికి పెంచాలని భారత్‌ నిర్ణయించిందన్నారు. విత్తన పరిశ్రమ పురోగతికి ఏప్రిల్‌ నెలాఖరులో హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. దీనికి అన్ని రాష్ట్రాల విత్తన కార్పొరేషన్లు, ఇతర పరిశోధన సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తామని తెలిపారు. దేశంలో నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయని, కానీ కొన్ని పేరొందిన కంపెనీల పేరిట అమ్ముతున్న నకిలీ విత్తనాలు కొని రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకు విత్తనం ఎక్కడ తయారైంది, దాని సమగ్ర వివరాలేంటో రైతులు తెలుసుకునేలా చేయాలని సూచించారు.

  కేంద్ర వ్యవసాయశాఖ విత్తన విభాగం సంయుక్త కార్యదర్శి అశ్వనీకుమార్‌ మాట్లాడుతూ.. దేశ వ్యవసాయ అవసరాలను తీర్చేందుకు నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడంపై పరిశ్రమ దృష్టిసారించాలని సూచించారు. విత్తన ధ్రువీకరణ, ఇతర అంశాల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ.. విత్తన పరిశ్రమపై ఏటా రూ.1700కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. సుమారు 2.5లక్షల మంది రైతులు 3లక్షల ఎకరాల్లో విత్తనాలను సాగు చేస్తున్నారని చెప్పారు. ఏటా 2.2లక్షల మెట్రిక్‌ టన్నుల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయని, వీటిని 18 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు జాతీయ, అంతర్జాతీయ విత్తన వాణిజ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలు, డిజిటల్‌ వ్యవసాయం, విత్తన నాణ్యత, ప్రపంచ విత్తన పరిశ్రమలో భారతదేశానికి ఉన్న ప్రస్తుత, భవిష్యత్తు అవకాశాలపై చర్చించారు.

  *తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థకు ప్రశంస

  విత్తన పరిశ్రమ బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ(టీఎస్‌ఎస్‌ఓసీఏ) చేస్తున్న కృషిని ఎన్‌ఎస్‌ఏఐ ప్రశంసించింది. టీఎస్‌ఎస్‌ఓసీఏ కృషిని అభినందిస్తూ కేంద్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌ తెలంగాణ వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, TSSOCA’s సంచాలకులు కేశవులుకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు