హెచ్‌ఐవీ బాధితులు భారత్‌లోనే అధికం

  0
  6

  భారత్‌లో 1,20,000 మంది 19ఏళ్ల లోపు యువత, బాలలు హెచ్‌ఐవీతో జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి (ఐరాస) తెలిపింది.

  వ్యాధి వ్యాప్తిని కట్టడిచేసే చర్యల్లో పురోగతి లేకపోతే 2030నాటికి రోజూ 80 మంది యుక్తవయస్కులు ఈ మహమ్మారికి బలయ్యే ముప్పుందని హెచ్చరించింది. 

  ఎయిడ్స్‌ దినోత్సవ నేపథ్యంలో.. ‘చిల్డ్రన్‌, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌: ద వరల్డ్‌ ఇన్‌ 2030’ పేరిట యూనిసెఫ్‌ 2018 నవంబర్ 30న ఓ నివేదిక విడుదల చేసింది. దానిలోని ప్రధాన అంశాలివీ..
  తల్లులు, గర్భిణులు, యువత, పిల్లల్లో హెచ్‌ఐవీ ముప్పులను తగ్గించడంలో దక్షిణాసియాలో గణనీయ పురోగతి కనిపిస్తోంది.
  భారత్‌లో 2017లో 1,20,000 మంది చిన్నారులు, యుక్తవయస్కులు హెచ్‌ఐవీతో జీవిస్తున్నారు. పాకిస్థాన్‌లో 5,800 మంది, నేపాల్‌లో 1,600 మంది, బంగ్లాదేశ్‌లో వెయ్యి కంటే తక్కువ మంది హెచ్‌ఐవీ బాలలున్నారు.
  2017లో కొత్తగా హెచ్‌ఐవీ సోకిన ఐదేళ్లలోపు బాలల సంఖ్య 2010తో పోలిస్తే 43 శాతం తక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అయితే ఇది 35 శాతం వరకు తగ్గింది.
  యాంటీరెట్రోవైరల్‌ థెరపీ (ఏఆర్‌టీ) చికిత్స తీసుకుంటున్న 14ఏళ్లలోపు బాలల సంఖ్య మొత్తం బాధితుల్లో 73 శాతం వరకూ ఉంది. ఇది 2010తో పోలిస్తే 50 శాతం వరకూ పెరిగింది.
  ఎయిడ్స్‌ మరణాలు, కొత్త ఇన్ఫెక్షన్‌ కేసుల సంఖ్య తగ్గుతోంది. అయితే ఈ తగ్గింపులో అంత వేగం కనిపించడం లేదు.
  హెచ్‌ఐవీ సోకిన బాలల్లో సగం మంది ఐదేళ్లు నిండకుండానే మరణిస్తున్నారు. తల్లుల నుంచి పిల్లలకు హెచ్‌ఐవీ సంక్రమించకుండా నిరోధించే చికిత్సలు అనుకున్న స్థాయిలో లక్ష్యాలు చేరుకోవట్లేదు.
  తల్లుల నుంచి పిల్లలకు హెచ్‌ఐవీ సోకిన కేసులు గత ఎనిమిదేళ్లలో 40 శాతం వరకూ తగ్గాయి. ఇలాంటి కేసుల్లో మూడింట రెండొంతుల మంది బాధితులు బాలికలే ఉన్నారు.