స్వదేశీ పరిజ్ఞానంతో తొలి మైక్రోప్రాసెసర్ అభివృద్ధి

    0
    13

    రక్షణ రంగ అవసరాలకు మరియూ నిత్యా అవసరాలకు సరిపడేలా ఐఐటీ మద్రాస్ నందు రూపకల్పన చేసారు.

    చరవాణులు, నిఘా కెమెరాలు లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను నడిపించేందుకు త్వరలో స్వదేశీ మైక్రోప్రాసెసర్లు రాబోతున్నాయి. వీటికి బాటలు పరిచే ‘శక్తి’ని ఐఐటీ-మద్రాస్‌ నిపుణులు సిద్ధం చేశారు. సైబర్‌ దాడుల ముప్పు తగ్గించడానికి ఈ తొలి స్వదేశీ మైక్రోప్రాసెసర్‌ తోడ్పడనుంది. మైక్రోప్రాసెసర్ల దిగుమతి కష్టాలనూ కొంతవరకు ఇది తప్పించే అవకాశముంది. మన రక్షణ, కమ్యూనికేషన్‌ రంగ అవసరాలకు సరిపడేలా దీన్ని తీర్చిదిద్దడం విశేషం. చండీగఢ్‌లోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన సెమీకండక్టర్‌ ప్రయోగశాలలో ఈ ప్రాసెసర్‌ను అభివృద్ధిచేశారు. దీనిలో ఆర్‌ఐఎస్‌సీ-వీ ‘ఓపెన్‌ సోర్స్‌’ ఇన్‌స్ట్రక్షన్‌ సెట్‌ ఆర్కిటెక్చర్‌(ఐఎస్‌ఏ)ను ఉపయోగించారు. ప్రాసెసర్లు పనిచేసేందుకు అవసరమైన ఆదేశాలనే ఐఎస్‌ఏగా పిలుస్తారు. ఇవి హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ల మధ్య వంతెనలా పనిచేస్తాయి. ఓపెన్‌ సోర్స్‌ ఐఎస్‌ఏను ఉపయోగించడంతో ఎలక్ట్రానిక్‌ పరికరానికి తగ్గట్టుగా దీనిలో మార్పులు చేసుకునే అవకాశముంటుంది. పరిశోధనకు ఐఐటీ మద్రాస్‌ అధ్యాపకుడు కామకోటి నేతృత్వం వహించారు. ఈ చిప్‌లలో బ్లూస్పెక్‌ ఓపెన్‌ సోర్స్‌ లాంగ్వేజీ ఉపయోగించామన్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, గణన యంత్రాలు పనిచేయడంలో మైక్రోప్రాసెసర్లు కీలక పాత్ర పోషిస్తాయి. గత జులైలోనూ 300 చిప్‌లతో ‘‘రైస్‌క్రీక్‌’’ పేరిట ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు అమెరికాలో ఓ మైక్రోచిప్‌ను అభివృద్ధి చేశారు. అయితే దీనిలో విదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.