స్వచ్ఛ నగరం సాధనే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ

  0
  6

  స్వచ్ఛ నగరం సాధనే లక్ష్యంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ..

  నూరు శాతం ఫలితాలు సాధించేందుకు మరో కొత్త కార్యక్రమానికి సిద్ధమైంది. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారంతో పాటు, అమలు పర్యవేక్షణ బాధ్యతలను ‘ఆస్కి’కి అప్పగించనుంది.

  నగరంలో నాలుగేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ఇంటింటికీ రెండు రంగుల చెత్తడబ్బాలు పంపిణీ చేసినా ఆశించిన మేర ప్రయోజనం కనిపించలేదు. దీంతో ఆస్కి సహకారం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

  ముఖ్యంగా చెత్తకు సంబంధించి ప్రజలకు తగిన సమాచారం, అవగాహన కల్పించడంతో పాటు వారి ప్రవర్తనలోనూ మార్పు తేవాలని, దాన్ని ఒకరి నుంచి మరొకరికి విస్తృతంగా వ్యాప్తి చేయాలని భావిస్తోంది. దీన్నే ‘ఇన్ఫర్మేషన్‌ఎడ్యుకేషన్‌ అండ్‌ బిహేవియరల్‌ చేంజ్‌ కమ్యూనికేషన్‌’ (ఐఈసీ అండ్‌ బీసీసీ)గా వ్యవహరిస్తోంది.

  ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2018కి అనుగుణంగా దీన్ని అమలు చేసేందుకు ‘ఆస్కి’ తగు కార్యాచరణ రూపొందించనుంది. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్‌ ర్యాంకింగ్స్‌లో దేశంలో అగ్రస్థానం పొందిన ఇండోర్‌లో స్వచ్ఛ కార్యక్రమాల అమలులో పాలుపంచుకున్న సంస్థల సేవలను సైతం వినియోగించుకోనుంది.

  దీంతోపాటు ఇప్పటికే దక్కించుకున్న ‘ఓడీఎఫ్‌ డబుల్‌ ప్లస్‌’ను నిలబెట్టుకోవడం కూడా కార్యాచరణలో భాగంగా ఉంది. పారిశుధ్య సేవల సక్రమ నిర్వహణ, ఐఈసీ అండ్‌ బీసీసీ అమలు, అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే వారి సామర్థ్యం పెంపు ఆస్కి కార్యాచరణలో ఉన్నాయి.