సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు భారీ మేలు

  0
  26

  సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు భారీ మేలు కలిగించే నిర్ణయాన్నితీసుకున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

      నూతన సంవత్సరం ఆరంభదినాన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు భారీ మేలు కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంది. రూ.25 కోట్ల వరకు ఉన్న బకాయి ఉండి, చెల్లించలేక పోతున్న రుణాన్ని, ఒకసారి పునర్‌ వ్యవస్థీకరించడానికి ఆర్‌బీఐ అనుమతించింది. అయితే ఈ రుణం స్టాండర్డ్‌ అసెట్‌గా ఉన్నపుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. 2016 నవంబరులో రూ.500, 1000 నోట్ల రద్దుతో పాటు 2017 జులైలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు వల్ల, నగదు కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఎంఎస్‌ఎంఈ రంగానికి ఇందువల్ల ఊరట లభించనుంది.

  ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి, రూ.25 కోట్ల వరకు ఉన్న ఒత్తిడికి గురవుతున్న రుణాల పునర్‌వ్యవస్థీకరణకు పథకాన్ని పరిశీలించాలని, గత నవంబరు 19న జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశం, ఆర్‌బీఐకి సూచించింది. ఆయా సంస్థల ఆర్థిక స్థిరత్వానికి వీలు కల్పించేలా మాత్రమే ఈ పథకం ఉండాలని తెలిపింది. దీనికి అనుగుణంగా తాజా నిర్ణయం వెలువడింది. 2019 జనవరి 1కి రూ.25 కోట్లకు మించని, స్టాండర్డ్‌ అసెట్‌గా గుర్తింపు పొందిన రుణాలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. 2020 మార్చి 31లోపు పునర్‌ వ్యవస్థీకరణ పూర్తవ్వాలి.

  • ఇప్పటికే ఉన్న ప్రొవిజన్లకు అదనంగా 5 శాతం జత చేయాలి. తాజా పథకం కింద రుణ పునర్‌ వ్యవస్థీకరణ అమలవుతున్న ఖాతాల కోసం ఇది చూపాలి.
  • ఆదేశాలు అందిన నెలలోగా, ప్రతి బ్యాంక్‌, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) కూడా తమ బోర్డు ఆమోదం ద్వారా, ఇందుకోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించుకోవాలి. పునర్‌వ్యవస్థీకరించిన రుణాలను ఎప్పటికప్పుడు పరిశీలించే వ్యవస్థను నెలకొల్పాలి.
  • సంస్థ రుణం పునర్‌ వ్యవస్థీకరించే నాటికి, ఆ సంస్థ జీఎస్‌టీలో నమోదై ఉండాలి. అయితే జీఎస్‌టీ నమోదు అవసరం లేదని మినహాయింపు పొందిన ఎంఎస్‌ఎంఈలకు ఇది వర్తించదు.
  • నిరర్థక ఆస్తిగా గుర్తించిన ఖాతాలను కూడా పునర్‌వ్యవస్థీకరించవచ్చు.
  • ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య వివాదం ఏర్పడటంలో, ఎంఎస్‌ఎంఈ పునర్‌ వ్యవస్థీకరణ పథకం అంశంపై భేదాభిప్రాయాలు కూడా కారణమయ్యాయి. తయారీ రంగంలో 50% వాటా కలిగిన ఎంఎస్‌ఎంఈలకు సహకరించాలని ప్రభుత్వం కోరుతూ వచ్చింది. వ్యవసాయం తరవాత అత్యధికంగా 12 కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది కూడా.