సీజీడీ నెట్‌వర్క్ పనులకు శంకుస్థాపన

    0
    8

    దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 129 జిల్లాల్లోని ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) నెట్‌వర్క్ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నవంబర్ 22న వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు.

    అనంతరం 10వ రౌండ్ గ్యాస్ లెసైన్స్‌ బిడ్డింగ్‌ను ప్రారంభించారు. ఈ 129 జిల్లాలను 50 జియోగ్రాఫికల్ ఏరియాలుగా విభజించారు. సీజీడీ నెట్‌వర్క్ పనుల శంకుస్థాపన సందర్భంగా మోదీ మాట్లాడుతూ… స్వేచ్ఛాయుత గ్యాస్ మార్కెట్, ధరల నియంత్రణ కోసం ట్రేడింగ్ ఎక్ఛ్సేంజ్‌తో పాటు స్వతంత్ర రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంట వ్యర్థాలను బయో-సీఎన్‌జీగా మార్చే 5వేల ప్లాంట్లను ఏర్పాటుచేస్తామన్నారు. రాబోయే 2-3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు గ్యాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పారిస్ వాతావరణ సదస్సు(కాప్ 21) సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా కాలుష్య నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

    10వ రౌండ్ బిడ్డింగ్ లో భాగంగా నెల్లూరు(ఏపీ), కొల్లామ్, అలప్పుజా(కేరళ), ఉజ్జయిని, గ్వాలియర్, మొరేనా(మధ్యప్రదేశ్), మైసూర్, గుల్బర్గా(కర్ణాటక), ముజఫర్‌పూర్(బిహార్) సహా 19 నగరాల్లో సీజీడీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధనల నేపథ్యంలో శంకుస్థాపనను నిలిపివేశారు. 2030 నాటికి దేశ విద్యుత్ అవసరాల్లో 40 శాతాన్ని సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.