సత్యం రామలింగరాజుపై సెబీ 14 ఏళ్లు నిషేధం

  0
  12

  దశాబ్దకాలం నాటి ‘సత్యం కుంభకోణం’లో సత్యం కంప్యూటర్స్‌ వ్యవస్థాపకుడైన బి.రామలింగరాజును 14 ఏళ్లపాటు సెక్యూరిటీస్‌ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించటానికి వీల్లేకుండా సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజి బోర్డు ఆఫ్‌ ఇండియా-సెబీ నిషేధించింది.

  • దీంతోపాటు చట్టవ్యతిరేకంగా సంపాదించిన రూ.813.40 కోట్ల మొత్తాన్ని, వడ్డీతో తిరిగి చెల్లించాలని 2018 నవంబర్‌ 2న ఆదేశించింది.
  • బి.రామలింగరాజుతో పాటు ఆయన సోదరులు బి.రామరాజు, బి.సూర్యనారాయణరాజు, ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. 14 ఏళ్ల నిషేధ కాలంలో ఇప్పటికే పూర్తయిన కాలం కలిసి ఉంటుంది. చట్టవ్యతిరేకంగా సంపాదించిన సొమ్మును గతంలో రూ.1,258.88 కోట్లుగా పేర్కొనగా, ఇప్పుడు దాన్ని రూ.813.40 కోట్లకు తగ్గించింది.
  • సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎస్‌ఏటీ) ఆదేశాల మేరకు సెబీ ఈ ఉత్తర్వులు ఇచ్చింది.
  • సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నుంచి నిషేధ కాలం బి.రామలింగరాజు, బి.రామరాజుకు 2014 జులై 15 నుంచి మొదలైంది. అందువల్ల అప్పటి నుంచి 14 ఏళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటారు.
  • అదేవిధంగా సూర్యనారాయణ రాజు, ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్‌ హోల్డింగ్స్‌ విషయంలో ఇది 2015 సెప్టెంబరు 10 నుంచి అమల్లోకి వచ్చింది.
  • సెబీ నిబంధనల్లోని మోసపూరిత- అనైతిక వర్తక విధానాల నిషేధం, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిషేధం నిబంధన కింద ఈ చర్యలు తీసుకున్నారు.