శ్రీ లంక నూతన ప్రధాని గా మహింద రాజపక్సె

    0
    12

    అధ్యక్షుడు సిరిసేనకు ప్రధాని రణిల్ విక్రమసింఘే మధ్య వివాదం పెనుతుపానుగా మారి పార్లమెంట్ రద్దుకు దారితీసింది. శనివారం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్లమెంట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో రాజకీయ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన వెల్లడించారు.

    శుక్రవారం ప్రధాని రణిల్ విక్రమసింఘేకు అధ్యక్షుడు సిరిసేన ఉద్వాసన పలికారు. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సెను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. ఈ మేరకు హడావుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని ఆర్థిక మంత్రి మంగళ సమరవీర మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విక్రమసింఘే అధికారిక నివాసాన్ని ఖాళీచేయలేదు. దీంతోపాటు తాను ఇంకా పదవిలోనే ఉన్ననని అధ్యక్షుడికి లేఖ రాశారు. తనను కేవలం పార్లమెంట్ ద్వారానే తొలగించగలరని ఈ లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీకి పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉందన్నారు. సిరిసేన చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ఖండించారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి జాతీయ ఛానల్లో ఆయన మాట్లాడుతూ‘‘ నేను ప్రధాన మంత్రి హోదాలో మీతో మాట్లాడుతున్నాను. నేను ప్రధానిగానే కొనసాగుతాను. ప్రధానిగానే పనిచేస్తాను’’ అని పేర్కొన్నారు.
    దీంతో శనివారం రాజీనామా చేయాలని రణిల్ విక్రమసింఘేకు అధ్యక్షుడు సిరిసేన నోటీసు జారీ చేశారు. దీంతో బలనిరూపణ చేసుకొనేందుకు పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని రణిల్విక్రమసింఘే డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంట్ స్పీకర్ కరు జయసూర్యాకు లేఖ రాశారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే పార్లమెంట్ను రద్దుచేస్తూ అధ్యక్షుడు సిరిసేన ఆదేశాలు జారీ చేశారు.