వివాహేతర సంబంధం నేరం కాదు : సుప్రీంకోర్టు

  0
  17

  వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని పేర్కొంటూ వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 497ను కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రా సభ్యులుగా గల ధర్మాసనం సెప్టెంబర్ 27న తీర్పు వెలువరించింది.

  మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లిందని, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు పెట్టలేమని పేర్కొంది. సమానత్వం అనేది రాజ్యాంగంలోని ప్రధాన అంశమని.. అయితే బ్రిటిష్ కాలంనాటి ఐపీసీలోని సెక్షన్ 497 మహిళల్ని పరిగణించే విధానం నిరంకుశత్వమని తేల్చిచెప్పింది. 
  విడాకులకు కారణంగా చూపొచ్చు 
  వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి వివాహ రద్దు లేదా విడాకులు తీసుకోవచ్చని కోర్టు వివరించింది. వివాహేతర సంబంధాల్ని నేరంగా పేర్కొంటున్న ఐపీసీ 497, వివాహానికి వ్యతిరేకంగా నేరాభియోగాలకు సంబంధించి సీఆర్‌పీసీలోని 198 సెక్షన్లను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. 
  ఐపీసీ సెక్షన్ 497ను ప్రవాస భారతీయుడు జోసెఫ్ షైన్ సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 
  తిరోగమన చర్య అవుతుంది : జస్టిస్ దీపక్ మిశ్రా
  ‘వరకట్న వేధింపులు, గృహ హింసతో పోలిస్తే వివాహేతర సంబంధం పూర్తిగా భిన్నమైనది. వివాహేతర సంబంధాన్ని నేరంగా భావిస్తే…అప్పటికే వైవాహిక జీవితం పట్ల సంతృప్తిగా లేని వారికి మరింత శిక్ష విధించినట్లవుతుంది. వివాహేతర సంబంధాన్ని నేర కోణంలోనే చూడటం తిరోగమన చర్య అవుతుంది. వైవాహిక జీవితంలో అసంతృప్తికి వివాహేతర సంబంధాలు కారణం కాదు. వైవాహిక జీవితంలో అసంతృప్తి వల్లే ఇలాంటి సంబంధాలు తలెత్తుతున్నాయి. 
  సెక్షన్ 497 ఏం చెబుతోంది.. 
  భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 497వ సెక్షన్ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంటోంది. ‘మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం జరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరం’ అని ఆ సెక్షన్ నిర్వచిస్తోంది. ఆ నేరానికి పురుషుడికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష కాని, జరిమానా కాని లేదా రెండూ విధించవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళను శిక్షించడానికి వీల్లేదని సెక్షన్ 497 స్పష్టం చేస్తోంది. అయితే, ఈ చట్టం ప్రకారం వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను కాని, భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్ చేసే హక్కు భార్యకు లేదు. 
  వివాహేతర సంబంధాలు
  ఈ దేశాల్లో నేరం.. 
  అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, ఇరాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, ఫిలిప్పైన్స్, యూఏఈ, అల్జీరియా, కాంగో, ఈజిప్టు, మొరాకో, నైజీరియా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు. 
  ఈ దేశాల్లో నేరం కాదు.. 
  చైనా, జపాన్, బ్రెజిల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నెదర్లాండ్‌‌స, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఐర్లాండ్, బార్బడోస్, బెర్ముడా, జమైకా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, ద. కొరియా, గ్వాటెమాలా .