వాయుసేనలోకి హెవీ లిఫ్ట్‌ హెలికాప్టర్లు

  0
  9

  భారత్‌ అత్యంత శక్తిమంతమైన 4 చినూక్‌ సీహెచ్‌ 47ఎఫ్‌(ఐ) హెవీ లిఫ్ట్‌ హెలికాప్టర్లను వాయుసేనలోకి చేర్చింది.

   ‘‘ఈ హెలికాప్టర్లు వాయుసేనకు గొప్ప ఆస్తి. వీటి రాకతో వాయుసేన ఎయిర్‌లిఫ్ట్‌ బలం పెరిగిపోతుంది.’’ అని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బి.ఎస్‌.ధనోవా తెలిపారు. వీటిని చండీగఢ్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో వాయుసేనకు అప్పగించారు. వీటిని అమెరికాలో ఫిలడెల్ఫియాలోని బోయింగ్‌ కర్మాగారంలో తయారు చేసి విడిభాగాలుగా భారత్‌ చేర్చారు. ఇక్కడ వాటిని అసెంబుల్‌ చేసి వాయుసేనకు అందించారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన హెలికాప్టర్లలో చినూక్‌ కూడా ఒకటి.

  ఒక పక్క టిబెట్‌.. అరుణాచల్‌ సరిహద్దుల్లో చైనా మోహరింపులు పెరిగిపోవడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. సంక్షోభ సమయంలో సరిహద్దులకు బలగాలను తరలించడం ప్రధాన సమస్యగా మారుతుందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో సరిహద్దులకు చేరేందుకు ఉన్న రవాణా మార్గాలను, సౌకర్యాలను వీలైనంత మెరుగు పర్చుకొనే పనిలో పడింది. ఈ క్రమంలో 2015లో భారత్‌ 15 చినూక్‌ హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేసింది.

  రెండు రొటేటర్లతో విభిన్నంగా కనిపించే ఈ హెలికాప్టర్‌ చాలా శక్తిమంతమైంది. దాదాపు 10 టన్నులకు పైగా పేలోడ్‌ను ఇది తీసుకెళ్లగలదు. అంటే ఎం777 శతఘ్నులు, జీపులను ఒక చోట నుంచి మరో చోటుకు తేలిగ్గా తరలించగలదు. సైనిక దళాలను వేగంగా పర్వతాలతో కూడిన సరిహద్దులకు చేర్చడానికి ఇటువంటి హెలికాప్టర్లు బాగా ఉపయోపడతాయి. ఎం777 శతఘ్నులను భారత సైన్యం చైనా సరిహద్దుల్లో మోహరించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి చినూక్‌ రాకతో మరింత బలం చేకూరింది. ఇంధన సరఫరా, సహాయ కార్యక్రమాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది.

  ఇప్పటి భారత వాయుసేనలో రష్యా తయారు చేసిన ఎంఐ26 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి కూడా అత్యంత శక్తిమంతమైనవి. ఇప్పటి వరకు భారత్‌ వీటినే హిమాలయ ప్రాంతాల్లో వినియోగిస్తోంది. శక్తి పరంగా చూసుకుంటే చినూక్‌ కంటే వీటి ఇంజిన్లు చాలా పెద్దవి. కానీ ఇదే పెద్ద లోపంగా మారింది. ఈ హెలికాప్టర్లు ఇంధనాన్ని విపరీతంగా వాడుకొంటాయి. ఖాళీ ఎంఐ 26 హెలికాప్టర్‌ బరువు దాదాపు 28 టన్నులు.. అదే సమయంలో చినూక్‌ ఖాళీ హెలికాప్టర్‌ బరువు 10 టన్నులు. దీంతో చినూక్‌కు ఇంధన వినియోగం కూడా చాలా తగ్గుతుంది. ఎంఐ26హెలికాప్టర్ల శక్తిలో 15శాతం తోకభాగంలో ఫ్యాన్‌ కారణంగా వృథా అవుతోంది. చినూక్‌లో ఈ సమస్యలేదు. అంతేకాకుండా ఎంఐ26 హెలికాప్టర్లు విడిభాగాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. అందుకే భారత్‌ ప్రభుత్వం దీనివైపు మొగ్గు చూపింది.