రైతు బీమా కింద రూ.500 కోట్లు చెల్లింపు

  0
  8

  బాధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారాన్ని చెల్లిస్తోంది.

  వివిధ కారణాలతో అకాల మరణం పొందే రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతుబీమా’ పథకం ఇప్పటివరకు పది వేలకు పైగా కుటుంబాలకు భరోసా కల్పించింది. బీమా పథకం కింద లబ్ది పొందిన వారిలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే ఉండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి.

  వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 10,012 కుటుంబాలకు రైతు బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరగా, క్లెయిమ్‌ల రూపంలో 500.60 కోట్లు నామినీల ఖాతాలకు జమ చేశారు.

  రైతు బీమా పథకం కింద లబ్ధిపొందిన రైతు కుటుంబాల్లో 91శాతం మేర కేవలం ఐదు ఎకరాలలోపు భూ విస్తీర్ణం కలిగినవారే ఉండటం గమనార్హం. లబ్ధిపొందిన కుటుంబాల్లో అత్యధికంగా బీసీలు 51శాతం మంది ఉన్నారు.

  దళారీల ప్రమేయం లేకుండా బీమా పరిహారంకోసం దరఖాస్తు చేయడం మొదలుకుని, బీమా సొమ్మును నేరుగా నామినీ ఖాతాకు ఆన్‌లైన్‌ విధానంలో బదిలీ చేస్తున్నారు. రైతు బీమా సొమ్మును బాధిత కుటుంబాలు భవిష్యత్తు అవసరాలు, జీవనోపాధి కోసం వినియోగించుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు కౌన్సెలింగ్‌ కూడా నిర్వహిస్తున్నారు.

  29.58 లక్షల కుటుంబాలకు బీమా

  రాష్ట్రంలో 90 శాతానికి పైగా రైతులకు ఐదు ఎకరాలలోపు భూ విస్తీర్ణం ఉండగా, వీరికి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. ప్రమాదవశాత్తూ లేదా అనారోగ్యంతో రైతు మరణిస్తే.. అతనిపై ఆధారపడిన కుటుంబం రోజువారీ జీవనానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.

  ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 29.58 లక్షల మంది 18–59 సంవత్సరాల వయసు కలిగిన రైతుల కోసం ప్రభుత్వం ‘రైతు బీమా’ పథకాన్ని 2018 ఆగస్టులో ప్రారంభించింది. ఈ పథకం అమలుకోసం ఒక్కో రైతుకు రూ.2,271.50 చొప్పున రూ.672 కోట్ల ప్రీమియంను జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.