‘రైతుబంధు’కు ఐరాస గుర్తింపు

    0
    2

    తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) గుర్తింపు లభించింది.
    ప్రపంచవ్యాప్తంగా రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో 20 పథకాలను ఐరాస ఎంపిక చేయగా వాటిలో రైతుబంధు, రైతుబీమాలకు చోటు లభించింది.

    ‘వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు’అనే అంతర్జాతీయ సదస్సులో ఈ పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ఐరాస ఆహ్వానం పంపింది. ఐరాసలోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) కేంద్ర కార్యాలయం రోమ్ నగరంలో నవంబర్ 21-23 తేదీల మధ్య ఈ సదస్సును నిర్వహించనున్నారు.

    వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం. ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మే 10, 2018 న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు.

    పధకము యొక్క వివరాలు :
    రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 4000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 8000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అనగా 181 వ రోజు నుంచి 270 వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది. ఈ పథకం అమలుకోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించారు