రూ.20 నాణెం ఆవిష్కరించిన ప్రధాని

  0
  7

  ప్రస్తుతం ఉన్న నాణేలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.20 నాణేన్ని అందుబాటులోకి తెచ్చింది.

  వృత్తాకారంలో కనిపించే ఈ నాణేనికి 12 భుజాలు ఉంటాయి. దేశంలోని వ్యవసాయ రంగం ఆధిక్యతను ప్రతిబింబించేలా నాణెంపై ధాన్యం గింజలు ముద్రించారు. ఈ నాణెంతోపాటు కొత్త తరహా రూ.1, రూ.2, రూ.5, రూ.10 నాణేలను కూడా ప్రభుత్వం ఆవిష్కరించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొత్త తరహా రూ.1, రూ.2, రూ.5, రూ.10 నాణేలు, రూ.20 నాణేన్ని గురువారం ఆవిష్కరించారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ట్విటర్‌లో ప్రకటించారు. చూపు లేని వారు సైతం ఈ నాణేలను సులువుగా గుర్తించగలరని వివరించారు. రూ.20 నాణెం బరువు 8.54 గ్రాములు ఉండగా, చుట్టుకొలత 27 మిల్లీ మీటర్లు.

  దిల్లీలోని లోక కల్యాణ్‌ మార్గ్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అంధ బాలల సమక్షంలో వీటిని అందుబాటులోకి తెచ్చారు.

  # ఈ కొత్త సిరీస్‌ నాణేలు ఆర్‌బీఐ ద్వారా మాత్రమే విడుదల అవుతాయి.
  # ఈ నాణేలను ఆర్థిక శాఖ నిర్ణయించిన ప్రదేశాల్లో మాత్రమే ముద్రించనున్నారు. ముంబయి, అలీపూర్‌(కలకత్తా), సైఫాబాద్‌(హైదరాబాద్‌), చర్లపల్లి(హైదరాబాద్‌) మింట్‌ కాంపౌండ్లలో వీటిని ముద్రించనున్నారు.
  # త్వరలో రూ. 20 నాణేన్ని విడుదల చేయనున్నట్లు ఆర్థికశాఖ ప్రకటించింది. రూ. 10 నాణెం 27 మిల్లీమీటర్ల వ్యాసంతో గుండ్రంగా ఉంటుంది. అయితే రూ. 20 నాణెంకు మాత్రం 12 అంచులు ఉంటాయని ఆర్థికశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది