రాజీనామా యోచనలో ఉర్జిత్‌ పటేల్‌

    0
    10

    కొన్ని రోజులుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ‌జైట్లీ ఆర్‌బీఐపై విమర్శలు చేయడంతో ఇవి మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ తన పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

    ‘విభేదాల దృష్ట్యా పదవికి రాజీనామా చేయాలని ఆర్‌బీఐ గవర్నర్‌ భావిస్తున్నారు’ అని ఈ వ్యవహరంతో సంబంధం ఉన్న ఓ వర్గం మీడియాకు తెలిపింది. అయితే దీనిపై అటు ఆర్‌బీఐ గానీ.. ఇటు ప్రధానమంత్రి కార్యాలయం గానీ స్పందించలేదు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య వ్యాఖ్యలతో కేంద్రం, ఆర్‌బీఐ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 7 కింద రిజర్వ్‌ బ్యాంక్‌కు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. దీంతో కేంద్రం వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఉర్జిత్‌ పటేల్‌ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం. మరోవైపు ఆర్‌బీఐ తాజా పరిణామాలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం స్పందించారు. ‘వార్తల్లో వస్తున్నట్లుగా రిజర్వ్‌బ్యాంక్‌కు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేస్తే.. ఈ రోజు మరిన్ని చెడు వార్తలు వినాల్సి వస్తుందని ఆందోళనగా ఉంది’ అని చిదంబరం ట్వీట్‌ చేశారు.