యూఎన్‌డీపీ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మి

    0
    10

    ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూన్‌డీపీ) సౌహార్ద రాయబారి(గుడ్‌విల్ అంబాసిడర్)‌గా భారత సంతతికి చెందిన అమెరికా రచయిత, నటి, మోడల్, టీవీ ప్రయోక్త పద్మాలక్ష్మి నియమితులయ్యారు.

    సౌహార్ద రాయబారిగా పద్మాలక్ష్మి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీల)సాధనకు మద్దతు కూడగడతారని యూఎన్‌డీపీ తెలిపింది. అసమానతలు, వివక్షలను పారదోలడంపై, నిరాదరణకుగురైన వారికి సాధికారత కల్పించడంపై ఆమె ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారని చెప్పింది.

    ప్రపంచంలో మహిళలు, బాలికలు అత్యంత తీవ్రమైన వివక్షను, కష్టాలను ఎదుర్కొంటున్నారని అమెరికాలోని న్యూయార్క్‌లో యూఎన్‌డీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పద్మాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అసమానతలు పేద దేశాల ప్రజలపైనే కాదు సంపన్న దేశాల ప్రజలపైనా తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తాయనే వాస్తవాన్ని సౌహార్ద రాయబారిగా అందరి దృష్టికీ తీసుకెళ్తానని ఆమె చెప్పారు.

    ‘పేదరికం తగ్గినా అసమానతలు తొలగడం లేదు’

    ”చాలా దేశాలు పేదరికాన్ని బాగా తగ్గించాయి. కానీ అసమానతలు మాత్రం తొలగిపోవడం లేదు. లింగ వివక్ష, వయసును బట్టి చూపే వివక్ష, జాతిని బట్టి చూపే వివక్ష వల్ల అసమానతలు ఇంకా తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితులు మహిళలపై, మైనారిటీలపై చాలా ప్రభావం చూపిస్తాయి” అని పద్మాలక్ష్మి విచారం వ్యక్తంచేశారు.

    మార్చి 8 మహిళా దినోత్సవం నేపథ్యంలో ఒక్క రోజు ముందు గురువారం పద్మాలక్ష్మి నియామకం జరిగింది. ఈ నియామకంపై ఆమె ట్విటర్‌లో స్పందిస్తూ- ఇది తనకు లభించిన గొప్ప గౌరవమని చెప్పారు.