యుద్ధనౌకల కోసం రూ.5,685 కోట్ల డీల్ ను ఓకే చేసిన భారత్

  0
  12

  భారత యుద్ధనౌకలు మరింత బలోపేతం కానున్నాయి. భారత్ కు చెందిన ఏడు యుద్ధనౌకల్లో ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థ (ఎల్ఆర్ఎస్ఏఎం)లను అమర్చనున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) బుధవారం వెల్లడించింది .

  ఈ కాంట్రాక్టు విలువ రూ.5,685 కోట్లు. ఈ కాంట్రాక్టులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే భారత్ ఇజ్రాయిల్ కు చెందిన బరాక్-8 శ్రేణి క్షిపణులను వినియోగిస్తోంది. ఇదే శ్రేణికి చెందిన ఎల్ఆర్ఎస్ఏఎంను ఇప్పుడు కొనుగోలు చేస్తోంది.
  ‘‘ ఐఏఐ కొన్నేళ్లుగా భారత్ తో కలిసి పనిచేస్తోంది. భారత్ ఐఏఐకు పెద్ద మార్కెట్. ఈ మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకొని మా స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నాం. ’’ అని ఐఏఐ సీఈవో నిమ్రాడ్ షీఫర్ వెల్లడించారు.
  బరాక్ -8 క్షిపణి వ్యవస్థను ఐఏఐ, డీఆర్డీవోలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీంతోపాటు ఇరు దేశాల నౌకాదళాలు, రాఫెల్ ఇజ్రాయిల్ విభాగం, భారత్ తో పాటు కొన్ని సంస్థలు కూడా దీనిలో పాలుపంచుకొన్నాయి.