ముగిసిన ఆసియా ఎయిర్ గన్ చాంపియన్‌షిప్‌

  0
  8

  చైనీస్‌తైపీలోని తవోయున్‌లో జరుగుతున్న ఆసియా ఎయిర్ గన్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజున భారత షూటర్లు ఐదు స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు.

  పోటీలకు ఆఖరి రోజైన ఏప్రిల్ 1న జరిగిన జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో యశ్‌వర్ధన్ పసిడి పతకం సాధించాడు. టీమ్ ఈవెంట్‌లో యశ్‌వర్ధన్ కెవల్ ప్రజ్‌పతి, ఐశ్వర్య్ తోమర్‌ల బృందం స్వర్ణం సాధించింది. మిక్స్‌డ్ ఈవెంట్‌లో యశ్‌వర్ధన్, శ్రేయ అగర్వాల్ స్వర్ణం నెగ్గారు.

  మరోవైపు జూనియర్ మహిళల 10 మీ. ఎయిర్‌రైఫిల్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో శేయ అగర్వాల్బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. అలాగే మెహులీ ఘోష్, కవి చక్రవర్తి, శేయ అగర్వాల్లతో కూడిన బృందం స్వర్ణ పతకాన్ని సాధించింది. 10 మీ. ఎయిర్‌రైఫిల్ పోటీలో మెహులీ మూడో స్థానంలో నిలిచి కాంస్యం చేజిక్కించుకొన్నాడు.

  అదేవిధంగా మార్చి 31న జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్లు దివ్యాన్‌‌ష సింగ్ పాన్వర్, ఎలవెనీల్ వలరియవన్ బంగారు పతకాలని సాధించారు. పురుషుల వ్యక్తిగత ఈవెంట్‌లో దివ్యాన్‌‌ష, మహిళల ఈవెంట్‌లో ఎలవెనీల్ చెరో స్వర్ణం గెలిచారు. అలాగే 10 మీ. ఎయిర్ రైఫిల్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో దివ్యాన్‌‌ష, రవికుమార్, దీపక్ కుమార్‌ల బృందం విజేతగా నిలిచి బంగారు పతకాన్ని నెగ్గింది. మహిళల టీమ్ ఈవెంట్‌లోను ఎలవెనీల్, అపూర్వీ, మేఘనలతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని సాధించింది.

  ఆసియా ఎయిర్ గన్ చాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌గా భారత్ 25 పతకాలు గెలుచుకుంది.ఇందులో 16 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలున్నాయి.